కలాం బయోపిక్‌లో నటించడం నా అదృష్టం

అలీ ప్రధాన పాత్రలో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం బయోపిక్‌ రూపొందుతోంది. మార్టిని ఫిలిమ్స్, పింక్‌ జాగ్వార్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పప్పు సువర్ణ నిర్మాణ సారథ్యంలో జగదీశ్‌ దానేటి, జానీ మార్టిన్‌ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కుతోంది. చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఆదివారం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో అలీ మాట్లాడుతూ ‘‘కేవలం ఫొటో దిగితే చాలు అనుకున్న గొప్ప వ్యక్తి బయోపిక్‌లో నటించడం నా అదృష్టం. బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌గా తన జీవితానుభవాలను విద్యార్థులందరికీ పంచాలని తపన పడిన వ్యక్తి కలాం. నా సినీ జీవితానికి సంతృప్తినిచ్చిన పాత్ర ఇది. నా జీవితానికి ఇది చాలు. హాలీవుడ్‌లో అలీ ఉన్నాడని గతంలో సరదాగా అనేవాడిని. ఇప్పుడు నిజం అవుతోంద’’న్నారు. జగదీశ్‌ మాట్లాడుతూ ‘‘అబ్దుల్‌ కలాం గురించి విస్తృత పరిశోధన చేశాం. కలాం జీవితంలోని అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అలీకి ఇది 1111వ చిత్రం’’ అని తెలిపారు. పప్పు సువర్ణ మాట్లాడుతూ..‘‘నాలుగు సంవత్సరాల కృషితో ఐదు స్క్రిప్టులు రూపొందించాం. తొలి సినిమాగా అబ్దుల్‌ కలాం చిత్రాన్ని తీసుకొస్తున్నాం. బిలియన్‌ డాలర్ల ఖర్చుతో ఐదు సినిమాలు తీసుకురానున్నాం’’ అని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, దర్శకుడు జానీ మార్టిన్, హాలీవుడ్‌ నటి లిల్లీ, సుచేత, సైదారెడ్డి, నాగాచారి తదితరులు పాల్గొన్నారు. ‘‘ఈ సంస్థల్లో ఛత్రపతి శివాజీ, భారత తొలి స్వాతంత్య్ర సంగ్రామం సహా ఐదుచిత్రాలు తెరకెక్కించనుండటం సంతోషం’’ అని ప్రకాశ్‌ జావడేకర్‌ ట్వీట్‌ చేశారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.