బన్నీలో ఇన్ని కళలున్నాయా అని ఆశ్చర్యపోయా!!

‘‘బన్నీ నాకు ‘రేసుగుర్రం’లో ఒకలా కనిపించాడు. ఇందులో ఒకలా కనిపించాడు. ఈ చిత్రం చూశాక తనలో ఇన్ని కళలున్నాయా? ఇలా ఎప్పుడూ చూపించలేదే అని ఆశ్చర్యపోయా. సంక్రాంతి పండక్కి ఊళ్లకి వెళ్లినవాళ్లు కోడి పందేలను ఎలా ఆస్వాదిస్తారో.. మా సినిమాని అలా ఆదరిస్తున్నారు. గతేడాది ముగింపులో ‘ప్రతిరోజూ పండగే’తో విజయం అందుకున్నా.. ఇప్పుడీ చిత్ర విజయంతో కొత్త సంవత్సరంలోకి సంతోషంగా స్వాగతం అందుకున్నా’’ అన్నారు అల్లు అరవింద్‌. ఆయన ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు)తో కలిసి నిర్మించిన చిత్రం ‘అల... వైకుంఠపురములో’. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించారు. పూజా హెగ్డే కథానాయిక. త్రివిక్రమ్‌ దర్శకుడు. ఆదివారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. విజయవంతంగా ప్రదర్శితమవుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ విలేకర్లతో మాట్లాడారు. ‘‘మా సినిమా అసలు సిసలు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమా విజయం నా జీవిత కాలంలో అందిన ఒక గొప్ప బహుమతి. రెండు వారాంతాల మధ్య పండగ రావడం చిత్రానికి బాగా కలిసొచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో పంపిణీదారులకు ప్రీమియర్‌ షోలతోనే పెట్టుబడి వెనక్కు వచ్చేసింది. తొలిరోజు నుంచే లాభాలు అందుకునే స్థితికి వెళ్లారు. యూఎస్‌లో తక్కువ థియేటర్లలో విడుదల చేసినా ఇదే తరహా స్పందన కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ ఇది బన్నీ కెరీర్‌లో ఆల్‌ టైం రికార్డ్‌ అని ప్రశంసిస్తున్నారు. పాటలకి తగ్గట్టుగానే చిత్రానికీ ఇంతే గొప్ప ఆదరణ దక్కుతోంది’’ అన్నారు అల్లు అరవింద్‌.
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.