డబ్బు విలువ తెలిసింది అప్పుడే!

‘‘తన కొడుకుకి డబ్బు విలువ తెలిసిరావాలని భావించిన ఓ తండ్రి ఏం చేశాడన్నదే మా చిత్ర కథ. ఈ సినిమాని మా నాన్నకి అంకితం చేస్తున్నా’’ అన్నారు అల్లు శిరీష్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఏబీసీడీ’. రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయిక. సంజీవ్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మధుర శ్రీధర్‌రెడ్డి, యష్‌ రంగినేని నిర్మిస్తున్నారు. డి.సురేష్‌బాబు సమర్పిస్తున్నారు. జుదా సాందీ స్వరకర్త. ఈ నెల 17న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరా బాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. యువ కథానాయకుడు నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్‌ మాట్లాడుతూ ‘‘బన్నీకి, రామ్‌చరణ్‌కి 21 ఏళ్లు వచ్చాక కారు కొనిచ్చారు. దాంతో నేను కూడా అడిగాను. ఏ కారు కావాలని అడిగినప్పుడు స్పోర్ట్స్‌ కారని చెప్పా. నీకు కారు కొనివ్వడమే లగ్జరీ, అలాంటిది స్పోర్ట్స్‌ కారా అంటూ మా నాన్న ఒప్పుకోలేదు. దాంతో నేను కోపంతో కారు వద్దన్నా. ఆ తర్వాత నేను కోరుకొన్న కారుని సొంతంగా కొనుక్కోవడానికి మూడేళ్లు పట్టింది. నాన్న ఆ రోజు చేసిన పని వల్ల నాకు డబ్బు విలువ తెలిసొచ్చింది. మలయాళంలో విజయవంతమైన ఈ సినిమాని తెలుగులో చేయమని చెప్పింది రామ్‌చరణే. తొలిసారి ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు మా నాన్నే గుర్తుకొచ్చారు. ఆయన స్ఫూర్తితోనే ఇందులో నా పాత్రకి అరవింద ప్రసాద్‌ అని పేరు పెట్టుకున్నా. నాగబాబు నాకు తండ్రిగా నటించారు. సంజీవ్‌ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు చక్కగా సినిమా తీశాడు. జుదా సాందీ స్వరాలు, రామ్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. రుక్సర్‌ గ్లామర్‌తోపాటు నటనతోనూ మెప్పిస్తుంది’’ అన్నారు. నాని మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే నాకు ‘పిల్ల జమిందార్‌’ గుర్తుకొచ్చింది. ఆ సినిమాని మించి ‘ఏబీసీడీ’ విజయవంతం కావాలని కోరుకుంటున్నా. శిరీష్‌ తన కెరీర్‌కి సంబంధించి ఎప్పుడో ఏబీసీడీలు మొదలు పెట్టాడు, ఈ సినిమాతో స్టార్‌డమ్‌కి సంబంధించి ఏబీసీడీలు ఆరంభించాలని కోరుకుంటున్నా. రుక్సర్‌ మంచి నటి’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘కొత్త దర్శకుడిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో నాకు అవకాశం ఇచ్చిన అల్లు శిరీష్‌, నిర్మాతలకి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘మధుర శ్రీధర్‌ నాకు మంచి స్నేహితుడు. ఆయనతో కొంతకాలం నుంచి ప్రయాణం చేస్తున్నా. ఈ సినిమాతో శిరీష్‌కి మంచి విజయం లభించాలని కోరుకుంటున్నా’’ అన్నారు డి.సురేష్‌బాబు. ఈకార్య క్రమంలో కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌, వెంకీ అట్లూరి, కేకే తదితరులు పాల్గొన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.