ఆనంద్‌తో మరో చిత్రం చేస్తాం

స్వచ్ఛమైన ఒక ప్రేమకథని నిజాయతీగా తెరపైకి తీసుకొచ్చాం. ప్రేక్షకులూ నిజాయతీగా ఆదరిస్తున్నారు. మా ‘పెళ్ళిచూపులు’ చిత్రం లాగే ‘దొరసాని’ కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది’’ అన్నారు నిర్మాతలు మధుర శ్రీధర్‌రెడ్డి, యష్‌ రంగినేని. ఇటీవలే ‘దొరసాని’ని నిర్మించారు. ఈ సినిమాతో దర్శకుడు కె.వి.ఆర్‌.మహేంద్ర, నాయకా నాయికలు ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక పరిచయమయ్యారు. చిత్రానికి లభిస్తున్న ఆదరణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు శ్రీధర్‌రెడ్డి, యష్‌ రంగినేని. వాళ్లు మాట్లాడుతూ ‘‘తెలంగాణలో 1980ల్లో జరిగిన కొన్ని సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కించిన చిత్రమిది. వసూళ్లు పెరుగుతున్నాయి. పతాక దృశ్యాలకి మంచి స్పందన లభిస్తోంది. 1980ల వాతావరణానికి దర్శకుడు అద్దం పట్టారు. శివాత్మిక, ఆనంద్‌ దేవరకొండ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఒక చిత్రం కొత్తనటులు, కొత్త దర్శకుడితో చేస్తాం. ఆనంద్‌ దేవరకొండతో మరో చిత్రం చేస్తాం’’ అన్నారు. ‘‘దొరసాని’లో తహసిల్దార్‌గా నటించా’’ అన్నారు యష్‌ రంగినేని.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.