ఇది నాన్న కోరిక.. మేం ఆచరిస్తున్నాం

అలనాటి తారలు శ్రీదేవి, రేఖకు అక్కినేని జాతీయ అవార్డులు దక్కాయి. ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చిరంజీవి, సుబ్బరామి రెడ్డి, బోనీ కపూర్‌ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగార్జున మాట్లాడారు.''సినిమా నాకు సర్వస్వం. అదే నాకు ఎంతో ఇచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఈ విధంగా అవార్డులు అందజేస్తున్నాం. సినిమా రంగానికి తమ సేవలతో గౌరవం తెచ్చేవారిని ఏఎన్నార్‌ జాతీయ అవార్డుతో సత్కరించాలనుకున్నాం' ఇది ఏఎన్నార్‌ జాతీయ అవార్డు గురించి నాన్న మదిలో ఆయన చెప్పిన మాటలు. ఆయన సంకల్పమే ఇవాళ మమ్మల్ని నడిపిస్తోంది. ఆయన ఆలోచనలనే మేం ఆచరిస్తున్నాం. చిత్ర పరిశ్రమలోని గొప్ప వ్యక్తులను సత్కరించి, వారి పేరుతోపాటు నాన్న పేరు కూడా చిరకాలం ఉండేలా ఈ అవార్డు ఇస్తున్నాం. శ్రీదేవి, రేఖకు ఆ గౌరవం దక్కాలని, వారికి ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ఇవ్వాలని నాన్న ఎప్పుడూ చెబుతుండే వారు. ఆయన ఉన్నప్పుడు వీరికి ఇవ్వలేకపోయాం. కానీ, తెలుగు సినిమా ఉన్నంత వరకు అక్కినేని నాగేశ్వరరావు ఉంటారు. ఈ వేదికపై ఉన్న ఏఎన్నార్‌ జాతీయ అవార్డుతోపాటు నాన్న ఇక్కడ మనతోనే, మనలోనే ఉన్నారని అనుకుంటున్నా. ఈ అవార్డులతో ఆయన సంకల్పం నెరవేరుతుందని ఆశిస్తున్నా' అని నాగ్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగచైతన్య, అఖిల్‌, అక్కినేని అమల, విజయ్‌దేవర కొండ, మంచులక్ష్మి, నిహారిక, అడవి శేష్‌, రాహుల్‌ రవీంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

(ఫొటోల కోసం క్లిక్‌ చేయండి)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.