ఆ లోటు ‘వీరరాఘవ’ తీరుస్తాడు!

‘‘అరవింద సమేత నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. నా గౌరవాన్ని పెంచిన సినిమా’’ అన్నారు త్రివిక్రమ్‌. ఆయన దర్శకత్వం వహించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ గురువారం విడుదలైంది. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించారు. పూజా హెగ్డే నాయిక. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ కథని నాకంటే ఎన్టీఆర్‌ ఎక్కువగా నమ్మారు. ‘నాకు ఏ కథ చెప్పారో అదే తీయండి. వాణిజ్య హంగుల కోసం అటూ ఇటూ వెళ్లకుండా కథకు ఏం కావాలో అదే చూపించండి అని చెప్పారు ఎన్టీఆర్‌. 1950 - 60ల్లో కథని నమ్మి సినిమాలు తీసేవారు. ప్రేక్షకులూ అలానే చూశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి మార్పు కనిపిస్తోంది. సాంకేతిక నిపుణుల సహకారం మర్చిపోలేనిది. విశ్రాంతి ఘట్టానికి ముందు యాక్షన్‌ సన్నివేశం తీస్తున్నప్పుడు రామ్‌ లక్ష్మణ్‌లు కూడా ‘మీ స్టైల్‌లో డైలాగులతో కూడిన యాక్షన్‌ సన్నివేశం తీద్దాం’ అన్నారు. ఎన్టీఆర్‌ రాయలసీమ యాసలో మాట్లాడడం కూడా కొత్తగా అనిపించింద’’న్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఇంద్ర, ఆది, సమరసింహారెడ్డి ఇవన్నీ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో వచ్చినవే. వాటికంటే భిన్నంగా ‘అరవింద సమేత’ని తీర్చిదిద్దారు. ప్రారంభ వసూళ్లు చూస్తే ఎన్టీఆర్‌ గత చిత్రాల రికార్డులని తిరగరాస్తుందనిపిస్తోంది. రెండు నెలల నుంచి సరైన సినిమాలు రావడం లేదు. ఆ లోటు ‘అరవింద..‘ తీరుస్తుంది. తమన్‌ సంగీతం బాగుంది’’ అన్నారు. సునీల్‌ మాట్లాడుతూ ‘‘నా పాత్ర నాకు బాగా నచ్చింది. ‘పాత్ర నిడివి ఎక్కువ లేదేంటి’ అని కొంతమంది మిత్రులు అడిగారు. నేను మాత్రం బిరియానీలో అరటిపండు కలుపుకుని తింటే ఎంత కొత్తగా ఉంటుందో నా పాత్ర నాకు అలా ఉందనిపించింది. కేవలం వినోదం కోసం ఒక్క సన్నివేశం కూడా తీయలేదు. కథకు ఏం కావాలో అదే చూపించారు. ఓ ఫ్యాక్షన్‌ చిత్రాన్ని కుటుంబ చిత్రంలా మలిచార’’న్నారు. ‘‘ముందు నుంచీ ఈ సినిమాకి సానుకూల స్పందనే వినిపిస్తోంది. ఇప్పుడు అదే నిజమైంది. నా సంగీతానికి మంచి గుర్తింపు లభించింద’’న్నారు తమన్‌. ఈ కార్యక్రమంలో నవీచ్‌ చంద్ర కూడా పాల్గొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.