నా మదికి దగ్గరైన చిత్రాల్లో ‘కురుక్షేత్రం’ ఒకటి

‘‘తొలినాళ్లలో నటన అంటే ఏమిటో తెలిసేది కాదు. నవ్వమంటే ఏడుస్తున్నట్టుగా మొహం పెట్టేవాణ్ని. కొన్ని సినిమాల తర్వాత అనుభవం వచ్చింది. ఆ తర్వాత నాకే తెలియకుండా నిర్మాతనయ్యా, దర్శకత్వం చేశా. నా కెరీర్‌లో అన్నీ అనుకోకుండానే జరిగాయి. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపలేదు’’ అన్నారు అర్జున్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కురుక్షేత్రం’. ఆయనకి ఇది 150వ చిత్రం. వరలక్ష్మి, చందన, ప్రసన్న, సుహాసిని, సుమన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అరుణ్‌ వైద్యనాథన్‌ దర్శకుడు. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో ఉమేష్‌రెడ్డి, శ్రీనివాస్‌ మీసాల, సాయికృష్ణ పెండ్యాల విడుదల చేస్తున్నారు. ఈ నెల 13న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక జరిగింది. శ్రీకాంత్‌, ఎ.కోదండరామిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అర్జున్‌ మాట్లాడుతూ ‘‘తొలినాళ్లలో ఓ కొరియన్‌ కుర్రాడిలా ఉండేవాణ్ని. దేహం సిక్స్‌ప్యాక్‌తో ఉండేది. గొప్పగా సాగిన ఈ 35 ఏళ్ల ప్రయాణంలో అద్భుతమైన వ్యక్తుల్ని కలిశాను. వాళ్ల నుంచి చాలా నేర్చుకొన్నా. ‘కురుక్షేత్రం’ నా హృదయానికి దగ్గరైన సినిమాల్లో ఒకటి. నేను నటించిన 150 సినిమాల్లో ఉత్తమమైన పది సినిమాల్ని ఎంచుకొంటే అందులో ‘కురుక్షేత్రం’ ఉంటుంది. ఒక నిజమైన పోలీసు అధికారి బలం ఏమిటి? బలహీనత ఏమిటి? అనే విషయాల్ని ఇందులో సహజంగా చూపిస్తున్నామ’’న్నారు. ‘‘అర్జున్‌ కెరీర్‌లో ఒక మైలురాయిలాంటి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు. అరుణ్‌ వైద్యనాథన్‌ మాట్లాడుతూ ‘‘అర్జున్‌ లేకపోతే ఈ సినిమా తెరకెక్కేది కాదు. ఆయన దర్శకుల నటుడు. రాత్రిళ్లలో తీసిన చాలా సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. కానీ ఆయన కథ నచ్చి ఈ సినిమాని ఎంతో ఓపికతో చేశార’’న్నారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ ‘‘1980ల్లోనే అర్జున్‌ సినిమాల్ని చూసి మన పరిశ్రమకి బ్రూస్‌లీ వచ్చాడు అనుకొనేవాళ్లం. పరిశ్రమకి వచ్చాక ఆయనతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమా బాగుంటుంది. ఈ చిత్ర దర్శకనిర్మాతలు అరుణ్‌, ఉమేష్‌ నాకు ఎప్పట్నుంచో తెలుసు. వాళ్లు ప్రస్తుతం మా రెండో అబ్బాయి రోహన్‌, ప్రభుదేవా ప్రధాన పాత్రధారులుగా ఓ సినిమాని తీస్తున్నార’’న్నారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, చందన, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.