డెహ్రాడూన్‌లో ఆరోజే చెప్పాను: మహేష్‌

‘‘విజయవాడ రావాలని నేనెప్పుడూ ప్లాన్‌ చేసుకోను. నా సినిమా విజయం సాధించినప్పుడల్లా కనకదుర్గమ్మ నన్ను పిలుస్తుంటుంది’’ అన్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. అశ్వనీదత్‌, దిల్‌రాజు, పీవీపీ నిర్మాతలు. ‘మహర్షి’ విజయోత్సవం శనివారం రాత్రి విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ ‘‘రాజకుమారుడు’ చేసినప్పుడు తొలి పది రోజులు ఏం అర్థం కాలేదు. ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో తెలీదు. ఓ స్నేహితుడిలా చూసుకున్నారు రాఘవేంద్రరావు మావయ్య. ‘నువ్వు పెద్ద సూపర్‌ స్టార్‌ అవుతావు’ అని ఆరోజే అన్నారు. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి ఈ సినిమా చేయడం గర్వంగా ఉంది. కథ విన్నప్పుడే భారీ విజయం సాధిస్తుందని అనుకున్నా. డెహ్రాడూన్‌లో తొలి రోజు షూటింగ్‌ ముగిశాక ‘పోకిరి స్క్వేర్‌ అవుతుంది’ అన్నాను. ఈ సినిమాలో మూడు పాత్రలూ బాగా నచ్చాయి. అందులో విద్యార్థి పాత్ర మరింత కిక్‌ ఇచ్చింది. సినిమా నచ్చితే అభిమానులు ఏ స్థాయికి తీసుకెళ్తారో నాకు తెలుసు. నా గత చిత్రాల రికార్డులన్నీ ఒక్క వారంలో దాటించారు. చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఇంకేం చేయలేను’’ అన్నారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘నేను దర్శకుడిగా వంద సినిమాలు తీసినప్పుడు ఎంత ఆనందపడ్డానో, ‘మహర్షి’ విజయాన్ని చూసి అంతగా సంతోషపడుతున్నాను. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందన్న మంచి సందేశం ఇచ్చిన చిత్రమిది. కామెడీతో పాటు ఎమోషన్‌నీ పండించగలనని నరేష్‌ నిరూపించాడు. మహేష్‌బాబుని నా సినిమాతో పరిచయం చేసినందుకు గర్వంగా ఉంది. ‘రాజకుమారుడు’ సెట్లో నన్ను ‘మావయ్యా’ అని పిలిచేవాడు. మరోసారి అలా పిలిపించుకోవాలని ఉంద’’న్నారు. అశ్వనీదత్‌ మాట్లాడుతూ ‘‘మహేష్‌తో తీసిన ‘రాజకుమారుడు’ మంచి విజయాన్ని సాధించింది. మహర్షి కూడా గొప్ప విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంద’’న్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘మహేష్‌ 25వ సినిమాలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. ‘మహర్షి’ కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంద’’న్నారు. ‘‘ఇది సినిమా కాదు. జీవన ప్రయాణం. మహేష్‌కి అభిమానులు సూపర్‌ స్టార్‌ అనే బిరుదు ఇచ్చారు. ఇక నుంచి ‘మహర్షి’ మహేష్‌ అని పిలుస్తార’’న్నారు ప్రసాద్‌ పొట్లూరి. దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘నాపై మహేష్‌ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నా’’అన్నారు. ‘‘దర్శకుడు నన్నెప్పుడూ నరేష్‌లా చూడలేదు. రవిలానే చూశారు. నన్ను ప్రేమించార’’న్నారు నరేష్‌. పూజా హెగ్డే మాట్లాడుతూ ‘‘మహేష్‌కి మైలు రాయిలాంటి చిత్రమిది. ఇందులో నాకూ భాగం ఉన్నందుకు ఆనందంగా ఉంది. తనతో మళ్లీ పనిచేయాలని ఉంద’’ని చెప్పింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘అభిమానులు కాలర్‌ ఎగరేసే సినిమా తీస్తానని విడుదలకు ముందే చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. మహేష్‌తో పనిచేసిన మూడేళ్లు ఎప్పటికీ మర్చిపోలేను. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకీ ఈ సినిమాని అంకితం చేస్తున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వైవీఎస్‌ చౌదరి, అనిల్‌ రావిపూడి, శిరీష్‌, లక్ష్మణ్‌, అనిల్‌ సుంకర, శ్రీమణి, శ్రీనివాసరెడ్డి, పృథ్వీ, ఆదిశేషగిరిరావు, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా దర్శకేంద్రుడు వేదికపై మాట్లాడుతూ..
‘కృష్ణ, మహేశ్‌ అభిమానులకు ఇవాళ పెద్ద పండుగ. మీకు అందరికీ ఒక్క పండుగ అయితే.. మహేశ్‌కు ఇది 25వ సినిమా కాబట్టి.. 25 పండుగలు ఒకేసారి చేసుకున్నట్లు (నవ్వుతూ). నిర్మాతలు దత్‌, దిల్‌రాజు, ప్రసాద్‌కు శుభాకాంక్షలు. మహేశ్‌.. మీ నాన్న గారు 25 సినిమాల సందర్భంగా ఈ రోజు నిన్ను చూసి ఎంత ఆనందపడుతున్నాడో.. నేను 100 సినిమాలు తీసినప్పుడు ఎంత ఆనందపడ్డానో.. ఇప్పుడు అంత సంతోషపడుతున్నా. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా (మహేశ్‌పైకి లేచి ధన్యవాదాలు చెప్పారు). వంశీ.. నువ్వు చేసిన ఈ ప్రయత్నం ప్రజలకు, సమాజానికి కూడా ఉపయోగపడేలా ఉంది. మహేశ్‌ను సీఈవోగా, రైతుగా, రుషిగా చూపించావు. సంపాదించింది చివరికి రైతుకు ఇవ్వాలనే సందేశాన్ని అద్భుతంగా చెప్పావు. దేవిశ్రీ అద్భుతమైన సంగీతం అందించారు. పూజా హెగ్డే గొప్పగా నటించావు. నేను ఆరోజే చెప్పా.. నువ్వు పెద్ద హీరోయిన్‌ అవుతావని (గతంలో సంభాషణను గుర్తు చేసుకుంటూ). నరేష్‌ కామెడీనే కాదు సీరియస్‌ పాత్రలు కూడా చేస్తావని నిరూపించావు. మీ నాన్న ఉంటే చాలా సంతోషించేవారు’.


ఈ సందర్భంగా ఓ విషయం గుర్తు చేసుకుంటున్నా. మహేశ్‌ హీరోగా మొదటి సినిమా ‘రాజకుమారుడు’.. సూపర్‌స్టార్‌ కృష్ణ నిర్మాత దత్ ప్రొడక్షన్‌లో చేయమన్నారు. ఆ సినిమాలో దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్‌. మహేశ్‌ నిన్ను నేను పరిచయం చేయడం గర్వంగా ఉంది. ఏప్రిల్‌ 28న వచ్చిన ‘అడవి రాముడు’, ‘పోకిరి’, ‘బాహుబలి’ రికార్డులు సృష్టించాయి. మే 9న వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోకసుందరి’, ‘మహానటి’, ‘మహర్షి’ హిట్‌ అయ్యాయి. ఇక నుంచి మే 9ని ‘మహర్షి’ డేగా పిలుస్తారు. ఈ ప్రయాణం ఇంతటితో ఆగదు. మహేశ్‌.. నాది చిన్న విన్నపం. ‘రాజకుమారుడు’ షూట్‌లో నన్ను మామయ్య, మామయ్య అనేవాడివి. ఇప్పుడు నువ్వు వేదికపైకి వస్తావు, నాకు ధన్యవాదాలు చెబుతావు. నన్ను రాఘవేంద్రరావు గారు అనొద్దు.. మామయ్య అను’ అని పేర్కొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.