‘భీష్మ’తో అభిమానుల ఆకలి తీరుతుంది!

‘‘క అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ‘భీష్మ’ అలా ఉంటుందని వెంకీ కుడుముల నాకు చెప్పాడు. ‘దిల్‌’, ‘సై’ తర్వాత మళ్లీ ఆ కోణంలో నన్ను చూపించాడ’’న్నారు నితిన్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘భీష్మ’. రష్మిక నాయిక. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మహతి స్వరసాగర్‌ సంగీతం అందించారు. 21న వస్తోందీ చిత్రం. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుకని నిర్వహించారు. త్రివిక్రమ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నితిన్‌ మాట్లాడుతూ ‘‘ఏడాదిన్నర విరామం తర్వాత చేసిన సినిమా ఇది. దర్శకుడు వెంకీ ‘దిల్‌’ సినిమాకి, నాకు అభిమాని అట. అంతే అభిమానంతో ఈ సినిమా చేశాడు. నా అభిమానులు ఎప్పట్నుంచో డ్యాన్స్‌ అడుగుతున్నారు. ఈ సినిమాలోని పాటతో అభిమానుల ఆకలి తీరుతుందని నమ్ముతున్నా. రష్మిక బాగా నటించింది. రష్మిక నాకు మంచి స్నేహితురాలు. తనని నేను భరిస్తా, తను నన్ను భరించాలి. మా ఇద్దరినీ నాకు కాబోయే భార్య భరించాలి. నా జీవితంలో పంచ ప్రాణాలంటే మా నాన్న, అమ్మ, మా సోదరి, పవన్‌ కల్యాణ్, త్రివిక్రమ్‌. నా ఆరోప్రాణం నాకు కాబోయే భార్య. త్రివిక్రమ్‌తో నాకు పరిచయం కావడం, ‘అఆ’ సినిమా చేయడం, నాజీవితంలో ఆయనుండడం నా అదృష్టం. ఆయన నా ముందుంటే నా దారి, నా పక్కనుంటే నా అండ, నా వెనకాల ఉంటే నా ధైర్యం’’ అన్నారు. త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘నితిన్‌కి వాళ్ల అన్నయ్య పవన్‌ కల్యాణ్‌ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ సినిమా బాగుంది. ఇందులో పనిచేసిన అందరికీ నా అభినందనలు. రష్మికకి విజయాలు ఇలాగే కొనసాగాలి. నిర్మాత వంశీ ‘జెర్సీ’ తర్వాత మరొక విజయంతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాడ’’న్నారు. రష్మిక మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో నిజాయతీతో కూడిన మంచి వ్యక్తుల్ని కలిశా. ‘ఛలో’కి ముందు నాకు ఈ పరిశ్రమ గురించి ఏమీ తెలియదు. కొత్త భాష.భయంగా ఉండేది. కానీ నేనిక్కడ ఉన్నానంటే కారణం వెంకీ కుడుముల. ఈ సినిమాతో నితిన్‌తో తెరను పంచుకునే అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో ఎంత నవ్వించాలో అంత నవ్వించారు. థియేటర్లో ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తార’’న్నారు. సంగీత దర్శకుడు మహతి సాగర్‌ మాట్లాడుతూ ‘‘నితిన్‌ అన్న ప్రోత్సాహం బాగుంటుంది. వెంకీ నా కోసం నిలబడ్డాడు. నితిన్, రష్మిక కెమిస్ట్రీ చాలా బాగుంది’’ అన్నారు. వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘‘నేను త్రివిక్రమ్‌ దగ్గర చేరడానికి కారణం నిర్మాత చినబాబు. నితిన్‌ నాకు బాగా సహకారం అందించారు. మహతి మంచి సంగీతం ఇచ్చారు. ‘ఛలో’ సినిమా కోసం రష్మికని తీసుకు రావడం కష్టమైంది. స్టార్‌ అయిపోయింది కాబట్టి ఈసారీ కష్టమే అనుకున్నా. కానీ వినగానే ఓకే చేసింది రష్మిక’’ అన్నారు. కార్యక్రమంలో చినబాబు, వెంకీ అట్లూరి, బ్రహ్మాజీ, శ్రీమణి, కాసర్ల శ్యామ్, సుధాకర్‌రెడ్డి, జానీ, వెంకట్, నిరంజన్, మాధవ్, రాకేష్, కిరణ్, అశోక్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.