ఎవరు ఎవర్ని కాపాడారు

శ్రీవిష్ణు, సత్యదేవ్‌, నివేదా థామస్‌, నివేతా పేతురాజ్‌ నటించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము... చిత్రమే చలనము’ అనేది ఉపశీర్షిక. రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలకపాత్రలు పోషించారు. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. విజయ్‌కుమార్‌ మన్యం నిర్మాత. హైదరాబాద్‌లో టీజర్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ప్రచార చిత్రం బాగా నవ్విస్తోంది. శ్రీవిష్ణుకి మంచి పేరు వస్తుంది. వివేక్‌సాగర్‌ స్వరాలు వినసొంపుగా ఉన్నాయి’’ అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘‘నా తొలి చిత్రానికి క్లాప్‌ ఇచ్చిన అనిల్‌ రావిపూడి ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. సెంటిమెంట్‌ రీత్యా విజయం లభిస్తుందని నా నమ్మకం’’ అన్నారు. ‘‘నేను చేసిన వాటిల్లో ఇదొక మంచి చిత్రమ’’ని నివేదా థామస్‌ అంది. సత్యదేవ్‌ మాట్లాడుతూ ‘‘నిర్మాత సహకారంతో చక్కని నిర్మాణ విలువలతో కథని ప్రేక్షకులకి నచ్చేలా దర్శకుడు తెరకెక్కించార’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘చిత్రంలోని ఆరుగురు ప్రధాన పాత్రధారుల్లో ఎవరు ఎవర్ని కాపాడగలిగారనేది సినిమాలోనే చూడాలి. అదంతా ఆసక్తికరంగా ఉంటుంద’’న్నారు. ‘‘గుంటూరు యాసలో సంభాషణలు పలికాను. ప్రేక్షకులకి వినోదాన్ని అందిస్తుంద’’ న్నారు ప్రియదర్శి. నిర్మాత మాట్లాడుతూ ‘‘జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నామ’’న్నారు.‘‘ప్రేక్షకులకి నచ్చే మంచి పాత్రని చేశాన’’ని రాహుల్‌ రామకృష్ణ చెప్పారు. ఛాయాగ్రహణం: సాయి శ్రీరాం.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.