మేం బద్ధకస్తులమా..సినిమాలు తీయలేమా

‘గూఢచారి చూసి, ఇప్పటి వరకూ మేం చేసిన సినిమాల్ని గుర్తు చేసుకుంటే మాకు సినిమాలు తీయడం తెలీదా? మేం బద్దకస్తులమా? అనిపించింది. కొన్నిసార్లు సిగ్గేసింది. తెలుగు సినిమా భవిష్యత్తుకు ఇలాంటి సినిమాలే దారి చూపిస్తాయి’’ అన్నారు అక్కినేని నాగార్జున. అడవిశేష్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గూఢచారి’. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. హైదరాబాద్‌లో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ ‘‘మేం చూసిన లొకేషన్లనే ఎప్పుడూ చూడని ప్రదేశాలని భ్రమించేలా మ్యాజిక్‌ చేశారు ఈ సినిమాలో. త్వరలో మీ ప్రతిభ అన్ని సినిమాలకూ కావాల్సివస్తుంది. మీతో పాటు నేను కూడా ప్రయాణం చేయాలి. లేదంటే వెనుకబడిపోతాను. ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇంత నాణ్యమైన సినిమా ఎలా తీశారో అని ఆశ్చర్యం వేస్తోంది. మేం పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి తీసే యాక్షన్‌ సన్నివేశాలు వీళ్లు చాలా సింపుల్‌గా, అంతే నాణ్యతతో తీశారు. అందుకే నేను చాలా అసూయపడుతున్నా. అదే సమయంలో గర్వంగానూ ఉంది. ‘శివ’లానే ‘గూఢచారి’ కూడా పరిశ్రమలో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతోంద’’న్నారు. ‘‘మా కలని ప్రపంచానికి చూపించింది ఈ చిత్ర నిర్మాతలే. నటీనటులు, సాంకేతిక నిపుణులు చక్కగా రాణించారు. నా కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ చిత్రం’’ అన్నారు అడవిశేష్‌. ఈ కార్యక్రమంలో అభిషేక్‌ నామా, శ్రీచరణ్‌ పాకాల, శనీల్‌ డియో, అభిషేక్‌ అగర్వాల్‌, అనిల్‌ సుంకర, సుప్రియ, మధుశాలిని తదితరులు పాల్గొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.