పరిశ్రమనే నమ్ముకున్న వాళ్ల కోసం: చిరు

ప్రముఖ కథానాయకుడు చిరంజీవి నివాసంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ గురువారం సమావేశమయ్యారు. చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్‌, సురేశ్‌ బాబు, సి.కల్యాణ్‌, దిల్‌ రాజు, జెమిని కిరణ్‌, శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి , రాజమౌళి, వి.వి.వినాయక్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఎన్‌.శంకర్‌, కొరటాల శివ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం తలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.... ‘చిత్రీకరణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించాం. థియేటర్లు ప్రారంభం కాగానే ప్రేక్షకులు వస్తారా? లేదా? అనేది ఓ సమస్య. ఒకట్రెండు రోజుల్లో అన్ని విషయాలపై నిర్ణయం తీసుకుంటాం. సినీ పరిశ్రమ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. సినిమా, టీవీ చిత్రీకరణలు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ అంశాలపై చర్చించాం. లాక్‌డౌన్‌ ఉన్నా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. షూటింగ్‌ అనుమతులపై పరిశీలిస్తున్నాం. ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామ’న్నారు. ‘మనందరం ఇలా సమావేశం అవడానికి ప్రధానం కారణం షూటింగ్స్‌ ఎప్పుడు మొదలవుతాయి? థియేటర్లు ఎప్పటి నుంచి తెరుచుకుంటాయనే విషయంపై ప్రభుత్వం నుంచి సమాధానం కోరేందుకే. లాక్‌డౌన్‌ సడలింపులో పలు రంగాలకు నిబంధనలతో పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమ కార్యచరణ అగమ్యగోచరంగా మారింది. దర్శకనిర్మాతల కోసం మేం ఈ విన్నపం చేయడం లేదు. పరిశ్రమను నమ్ముకుని బతుకుతున్న ఎంతో మంది కార్మికుల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని అడుతున్నాం. వాళ్ల గురించి ఆలోచించి మార్గనిర్దేశం చేయాలని మా అందరి తరఫున మిమ్మల్ని కోరుతున్నాన’న్నారు చిరంజీవి. ‘షూటింగ్స్‌ అంటే చాలామంది జనం ఉంటారు. సినిమాలో అలాంటి సన్నివేశాలు చాలా తక్కువ ఉంటాయి. మీరు అనుమతిస్తే అతి తక్కువ మందితో సన్నివేశాలు చిత్రీకరిస్తాం. జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రభుత్వ నియమాలు పాటిస్తాం’ అని తెలిపారు రాజమౌళి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.