చిరంజీవే పైకి లేపారు!!

‘‘అర్జున్‌ సురవరం’ ఓ సినిమా కాదు. గొప్ప అనుభవం. మీడియా శక్తిని అందరికీ అర్థమయ్యేలా చూపించిన చిత్రమ’’న్నారు నిఖిల్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి టి. సంతోష్‌ దర్శకత్వం వహించారు. లావణ్య త్రిపాఠి కథానాయిక. ఆకెళ్ల రాజ్‌కుమార్‌ నిర్మాత. ఠాగూర్‌ మధు సమర్పకులు. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోన్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమా చూసిన ప్రతిఒక్కరూ గౌరవప్రదమైన చిత్రం చేశావంటూ ఫోన్‌ చేసి మెచ్చుకుంటున్నారు. ఫలితం పట్ల పంపిణీదారులు సంతోషంగా ఉన్నారు. ‘ఎక్కడికీ పోతావు చిన్నవాడా’ నా కెరీర్‌లో చాలా పెద్ద హిట్‌. దాని తర్వాత నేను చేసిన చిత్రాలు బాగానే ఆడినప్పటికీ నాలో అంత సంతోషాన్ని నింపలేదు. కానీ, ఈ చిత్రంతో తిరిగి నా ముఖంలోకి నవ్వులు వచ్చాయి. మా కష్టానికి, ఏడాదిన్నర ఎదురు చూపులకు తగిన ఫలితం దక్కింది. ఈ విషయంలో చిరంజీవికి పెద్ద థ్యాంక్స్‌ చెప్పాలి. అనేక అవాంతరాలు దాటుకొని వచ్చిన మా చిత్రాన్ని ఆయనే పైకెత్తారు. విజ్ఞానంతో పాటు వినోదం కలగలిసిన చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇక ఇంత ఆలస్యం తర్వాత థియేటర్లలోకి వచ్చి మంచి విజయాన్ని అందుకోవడం మరింత అరుదు. ఇవన్నీ ఈ చిత్ర విషయంలో జరిగాయి. ఈ విజయంలో క్రెడిట్‌ అంతా దర్శకుడిదే. చిత్రీకరణ సమయంలో మేమిద్దరం చాలా గొడవ పడ్డాం. నిర్మాతలు బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. వాళ్లు ఈ చిత్రానికి కొనసాగింపు చెయ్యాలని ఆలోచన చేస్తున్నారు’’ అన్నారు. ‘‘నిఖిల్‌ మంచి నటుడని అందరికీ తెలుసు. ఇందులో మరింత పరిణతితో కూడిన నటనను చూపించారు. ప్రతి సన్నివేశాన్ని తన నటనతో హైలైట్‌ చేశారు. నాగినీడు పాత్ర సినిమాకు వెన్నుముకలా నిలిచింది. చిత్రీకరణ సమయంలో లావణ్య మంచి ప్రోత్సాహమిచ్చింది. ఇంత చక్కటి విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు దర్శకుడు. ‘‘ఆలస్యంగా వచ్చినా మంచి విజయం దక్కింది. సినిమా బాగుందని ముందే తెలుసు కానీ, ఇంత భారీ విజయాన్ని ఊహించలేదు. దర్శకుడితో పాటు నటీనటులంతా ఎంతో కష్టపడి చేశారు. నాకీంత చక్కటి అవకాశమిచ్చినందుకు చిత్ర బృందానికి ధన్యవాదాలు’’ అంది లావణ్య.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.