ఇది మరో ‘పెళ్లిచూపులు’..

‘పెళ్లిచూపులు’, ‘మెంటల్‌ మదిలో’ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలతో నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రాజ్‌ కందుకూరి. ఇప్పుడాయన తన తనయుడు శివ కందుకూరిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘చూసీ చూడంగానే’. వర్ష బొల్లమ్మ, మాళవిక సతీశన్‌ కథానాయికలు. నూతన దర్శకురాలు శేష సింధు రావ్‌ తెరకెక్కించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సమర్పిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘నేనెప్పుడూ కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి ముందుంటా. ఈ క్రమంలోనే ‘పెళ్లిచూపులు’తో తరుణ్ భాస్కర్, ‘మెంటల్‌ మదిలో’తో వివేక్‌ ఆత్రేయ వంటి వాళ్లను పరిచయం చేశా. నా నిర్మాణంలో ఓ మహిళా దర్శకురాల్ని పరిచయం చేయాలని ఉండేది. ఆ కోరిక ఈ చిత్రంతో తీరింది. ఈ చిత్రమూ వాటిలాగే చక్కటి ఆదరణ దక్కించుకుంటుందని నమ్మకం ఉంది. శేష సింధు గతంలో సుకుమార్‌ వద్ద చేసింది. ఆమె తొలిసారి నాకు కథ చెప్పగానే చాలా నచ్చింది. అందుకే వెంటనే అవకాశమిచ్చా. ఆమె మొదటి నుంచీ ఈ కథను కొత్తవాళ్లతోనే చెయ్యాలనుకుంది. అప్పటికే తనకి మా అబ్బాయి నటనలో శిక్షణ తీసుకున్నాడని తెలియడం.. ఈపాత్రకు తను సరిపోతాడని ఆమె నమ్మడంతో శివను కథనాయకుడిగా తీసుకున్నాం. నేనూ వాడి ప్రతిభను నమ్మే అవకాశమిచ్చా. ఓ చక్కటి కాలేజీ ప్రేమకథతో రూపొందిన చిత్రమిది. వర్ష, మాళవికలకు తెలుగులో తొలి చిత్రమైనా చక్కగా నటించారు. గోపీ సుందర్‌ స్వరాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. దీన్ని జనవరి 31న విడుదల చేస్తున్నామ’’న్నారు. ‘‘మా ఏడాది కష్టాన్ని మీకు చూపించేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. నిజానికి ఆడవాళ్లు దర్శకత్వం అనగానే నిర్మాతలు కొన్ని అనుమానాలు పెట్టుకుంటారు. కానీ, రాజ్‌ సర్‌ కథ చెప్పగానే ఓకే చెప్పారు. 24ఏళ్ల అబ్బాయి కథ ఇది. శివ అయిదు విభిన్న లుక్స్‌లో దర్శనమిస్తారు. వర్షకి తొలి చిత్రమే అయినా తెలుగు నేర్చుకొని మరీ తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంది. పద్మ రాసిన మాటలు చిత్రానికి ప్రధాన బలం. ఆమె సినిమాకు వెన్నుముక. చిత్రీకరణలో ఎక్కువగా ఆడవాü™్ల పాలుపంచుకున్నార’’న్నారు దర్శకురాలు. ‘‘నాకిలాంటి స్క్రిప్ట్‌ను ఇచ్చినందుకు నాన్నకి, శేష సింధుకి థ్యాంక్స్‌. ఓ యువ బృందంతో కలిసి యువతరానికి నచ్చేలా ఓ చక్కటి చిత్రం చేశాం. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. సురేష్‌బాబు సర్‌ మా చిత్రానికి అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు’’ అన్నారు హీరో శివ.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.