ఉత్సాహభరితం ‘సినీ మహోత్సవం’

తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ‘సినీ మహోత్సవం’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. తారల ఆట పాటలు, వినోద కార్యక్రమాలతో ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన ఈ వేడుకకు పరిశ్రమ మొత్తం తరలి వచ్చింది. చిరంజీవి, మహేష్‌బాబు, రాజశేఖర్‌ తదితర అగ్ర నటులు పాల్గొన్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రగ్యాజైస్వాల్, రెజీనా, పూజా హెగ్డే, కేథరిన్, ఈషా, లావణ్య త్రిపాఠి, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, రుక్సార్‌ థిల్లాన్‌ తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ వేదికపై రాశీఖన్నా, దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు పాడి ఆహుతుల్ని అలరించారు. ఈ వేడుకకు హాజరైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఊటీలానే కశ్మీర్‌ని కూడా సినిమా చిత్రీకరణలకు అనుకూలంగా మార్చబోతున్నాం. అక్కడ స్డూడియోలు నిర్మించాలనుకుంటే అనుమతులు కూడా మంజూరు చేస్తాం. సింగిల్‌ విండో పద్ధతిన ఎవరికీ ఎలాంటి ఆటంకం కలగకుండా అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంద’’న్నారు. మహేష్‌బాబు మాట్లాడుతూ ‘‘చిరంజీవిగారి పక్కన కూర్చోవడం, ఈ వేడుకలో పాలు పంచుకోవడం ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంద’’న్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌కు రూ.32 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సీనియర్‌ నటీనటులు కృష్ణ, కృష్ణంరాజు, గిరిబాబు, మురళీమోహన్, గీతాంజలిలను యూనియన్‌ సత్కరించింది. కె.రాఘవేంద్రరావు, కోట శ్రీనివాసరావు, సుబ్బరామిరెడ్డి, అశ్వనీదత్, రాజేంద్రప్రసాద్, అల్లు అరవింద్, నాగబాబు, సుమలత, జయప్రద, జయసుధ, జీవిత, నరేష్, ఆర్‌.నారాయణమూర్తి, బోయపాటి శ్రీను, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వరరావు, సాయిధరమ్‌ తేజ్, వంశీ పైడిపల్లి, అనిల్‌ రావిపూడి, నిహారిక తదితరులు పాల్గొన్నారు.(మరిన్ని చిత్రాలకు క్లిక్‌ చేయండి)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.