చరిత్ర ఉన్నంతవరకు..దాసరి మన మధ్యలోనే

‘‘దాసరి పంచిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని చిత్ర పరిశ్రమలోని అందరం కలివిడిగా, కుటుంబ సభ్యుల్లా నడుచుకుందాం’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ. శుక్రవారం హైదరాబాద్‌లోని చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయం ఆవరణంలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు విగ్రహా విష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణ, విజయనిర్మల, బాలకృష్ణతోపాటు, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ‘‘దర్శకుడు కాక ముందు నుంచి దాసరి నారాయణరావుతో పరిచయం ఉంది. నేను నటించిన ‘మా నాన్న నిర్దోషి’కి ఆయన అసోసియేట్‌గా పనిచేశారు. ‘జగత్‌ ఖిలాడీలు’, ‘మేనకోడలు’, ‘హంతకుడు దేవాంతకుడు’ సినిమాలకి సంభాషణలు రాశారు. దాసరి దర్శకుడయ్యాక ఆయనతో ‘రాధమ్మ పెళ్లి’తో పాటు పలు చిత్రాల్లో నటించా. 151 సినిమాలకి దర్శకత్వం వహించడం అంటే మాటలు కాదు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో దాసరి పేరు నమోదైంది. భవిష్యత్తులో కూడా ఏ దర్శకుడూ అన్ని సినిమాలు తీయలేడు. ఆయన జయంతిని దర్శకుల రోజుగా ప్రకటించినందుకు దర్శకుల సంఘాన్ని అభినందిస్తున్నా’’ అన్నారు. విజయనిర్మల మాట్లాడుతూ ‘‘దాసరి తొలి చిత్రం ‘తాత మనవడు’లో నటించమని నన్నడిగారు. అప్పటికి నేను కృష్ణతో పాటు, శోభన్‌బాబు చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పా. కానీ చాలా బాగుంటుందమ్మా ‘మీరు నటించండి’ అని చెప్పి నన్ను ఆ సినిమాలో భాగం చేశారు. ఆయన తొలి చిత్రమే 25 వారాలు ఆడింది’’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ఒక మనిషి అత్యున్నత శిఖరాలకి ఎదగాలంటే సంకల్పం కావాలని మా నాన్నగారు ఎప్పుడూ చెబుతుండేవారు. దాసరి ధృఢ సంకల్పంతో ఉన్నత శిఖరాలకి ఎదిగిన వ్యక్తి. ఆయన జయంతి సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందదాయకం. భావితరాలకు స్ఫూర్తి దాసరి. ఎప్పుడూ ఉత్సాహంగా, కలివిడిగా పరిశ్రమకి తలలో నాలుకలా ఉంటూ, ఎవరికి ఏ కష్టం వచ్చినా తన ఇంట్లో సమస్యగా భావించి పరిష్కరించేవారు. ఆయన దర్శకత్వంలో నటించాలని నాకు ఎప్పట్నుంచో ఉండేది. కాకతాళీయమో, యాధృచ్ఛికమో ఆయన 150వ చిత్రమైన ‘పరమవీరచక్ర’లో నేను నటించా. నేనెన్ని సినిమాలు చేశానో తెలియదు కానీ అన్ని సినిమాల ఆనందానుభూతులు నాకు ఆ చిత్రంతో కలిగాయి. ‘శివరంజని’ సినిమాని నన్ను కథానాయకుడిగా పెట్టి తీస్తానని నాన్నగారితో చెప్పారు దాసరి. ‘చదువయ్యాక మీ దర్శకత్వంలో నటిస్తాడ’ని చెప్పారు నాన్న. జాతీయ అవార్డులు, నంది అవార్డులు ఎన్నో ఆయన్ని వరించాయి. అవన్నీ ఆయన ముందు దిగదుడుపే. ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేయడమే ఆయన సంపాదించుకొన్న ఓ గొప్ప స్థానం. ఎంతోమంది దర్శకుల్ని, నటీనటుల్ని పరిచయం చేసి జీవితాల్నిచ్చారు. సగటు మనుషులు, మధ్య తరగతి జీవితాల్ని ఆవిష్కరిస్తూ కళాఖండాల్ని తెరకెక్కించారు. కథా రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగానే కాకుండా, కార్మికుల శ్రేయస్సుని కాంక్షిస్తూ చలన చిత్ర పరిశ్రమ బాగు కోసం పాటుపడ్డారు. గురుతుల్య స్వభావం, కలిసిపోయే తత్వం, ఏదున్నా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం, క్రమశిక్షణ, సేవా థృక్పథం... ఇవన్నీ కలిపిన ఓ నిండు కుండ దాసరి నారాయణరావు’’ అన్నారు. దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ కార్యదర్శి రవి కొట్టాకర మాట్లాడుతూ ‘‘భాషతో సంబంధం లేకుండా అందరి హృదయాల్లో నిలిచిపోయే వ్యక్తి దాసరి నారాయణరావు. ఆయనది గొప్ప మనసు’’ అన్నారు. నటుడు, ఎంపీ మురళీమోహన్‌ మాట్లాడుతూ ‘‘సినిమాకి దర్శకుడే కెప్టెన్‌ అని చాటి చెప్పిన వ్యక్తి దాసరి. ఆ స్థానానికి గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆయన జయంతిని దర్శకుల రోజుగా ప్రకటించినందుకు ఆనందంగా ఉంది. సినిమా పరిశ్రమ రోజుగా చేస్తే కూడా బాగుంటుంది. తదుపరి పార్లమెంటు సమావేశాల్లో దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని దాసరికి ప్రకటించాలని డిమాండ్‌ చేస్తాం. భారతరత్న కూడా ఇవ్వాలని కోరబోతున్నామ’’న్నారు. తలసాని శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ ‘‘దాసరి విగ్రహావిష్కరణ చేయడం సంతోషం. చరిత్ర ఉన్నంతవరకు వారుండాలని ఈ నిర్ణయం తీసుకొన్నందుకు పరిశ్రమని అభినందిస్తున్నా. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌ రావడానికి ప్రధానమైన కారకుడు దాసరి నారాయణరావు. ఈ రోజు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా చాలా సందర్భాల్లో దాసరిని గుర్తు చేసుకొంటున్నారు. దాసరి నారాయణరావు వ్యక్తిత్వం, వారి పేరు ప్రఖ్యాతుల్ని దృష్టిలో ఉంచుకొని ఆయన మరణించాక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాంటి గొప్ప వ్యక్తుల్ని ఎప్పటికీ మరవకూడదు. చరిత్ర ఉన్నంతవరకు దాసరి మన మధ్యలోనే ఉంటార’’న్నారు. వి.వి.వినాయక్‌, ముత్యాల సుబ్బయ్య, జి.ఆదిశేషగిరిరావు, విజయ్‌చందర్‌, మురళీమోహన్‌, ఎన్‌.శంకర్‌, కాజా సూర్యనారాయణ, రమేష్‌ ప్రసాద్‌, కొమర వెంకటేష్‌, ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌.డి.సి. ఛైర్మన్‌ అంబికాకృష్ణ, కె.ఎల్‌.నారాయణ, అల్లు అరవింద్‌, ముత్యాల రాందాస్‌, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

దాసరిలాంటి పెద్దలు కావాలి: పవన్‌కల్యాణ్‌ :‘ ‘తెలుగుసినిమా రంగం అంతా ఒక కుటుంబం. మన ఇంటి సమస్య మనమే చర్చించుకొని పరిష్కరించుకోవాలనేది దాసరి నారాయణరావు భావన. మన తెలుగు సినిమాకి అలాంటి కుటుంబ పెద్దలు అవసరం’’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు ప్రముఖ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌. శుక్రవారం దాసరి జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ ఓ ప్రకటనని విడుదల చేశారు పవన్‌. దాసరి మొదటి సినిమా ‘తాతా మనవడు’ నుంచి వారి సినిమాల్లో కుటుంబ విలువలు, సామాజిక స్పృహ కనిపించేదని... వారితో నాకు మంచి అనుబంధం ఉండేదని అందులో పేర్కొన్నారు. ‘‘రంగస్థలం నుంచి సినిమాలకి వచ్చిన దాసరి.. నటుడిగా, నిర్మాతగా, రచయితగా బహుముఖ సేవల్ని అందించారు. పత్రికాధిపతిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానం మరవలేనిది. ఏ రంగంలో ఉన్నా తాను దర్శకుడిని అని చెప్పుకోవడాన్ని గౌరవంగా భావించేవారు. ఓ దర్శకుడిగానే కాదు, తెలుగు సినీ కుటుంబానికి పెద్దగా దాసరి స్థానం సుస్థిరం. ఎవరికి ఏ సమస్య వచ్చినా వారి ఇంటి తలుపు తడితే పరిష్కారం దొరుకుతుందనే ఓ భరోసా ఉండేది. దాసరి చూపిన బాటని అనుసరించడమే ఆయనకి ఘనమైన నివాళి’’ అని పవన్‌ స్పష్టం చేశారు.

దాసరి జయంతి ఓ పండుగ
‘‘పరిశ్రమలో అంతా క్రమశిక్షణతో మెలగడమే దాసరికి నిజమైన నివాళి. ఆయన జయంతిని సంతాపసభలా కాకుండా, ఓ పండుగలా చేసుకోవాల’’న్నారు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ. దాసరి నారాయణరావు జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కుటుంబసభ్యులు, చిత్ర పరిశ్రమ సమక్షంలో శుక్రవారం జరిగాయి. దాసరి మనవరాలు నీరాజిత కేక్‌ను కట్‌ చేసింది. బి.ఎస్‌.ఎన్‌.సూర్యనారాయణ ఏర్పాటు చేసిన దాసరి టాలెంట్‌ వెబ్‌సైట్‌ను సి.కల్యాణ్‌, తమ్మారెడ్డి భరద్వాజ సంయుక్తంగా ప్రారంభించి, దాసరి టాలెంట్‌ అకాడమీ బ్రోచర్‌ను విడుదల చేశారు. అనంతరం సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘చిత్రపరిశ్రమలో సమస్యల్ని పరిష్కరించడంలో దాసరి ముందుండేవారు. ఇప్పుడాయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మన సమస్యల్ని పరిష్కరించుకోడానికి దాసరిని ప్రేరణగా తీసుకుని ముందుకు నడవాలి. నా దృష్టిలో చిత్రపరిశ్రమకి సేవచేసినవారు దాసరి పేరును గుర్తుపెట్టుకున్నట్టే లెక్కవుతుంద’’న్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘‘ఇటీవలి కాలంలో ఏర్పడిన సమస్యల దృష్ట్యా దాసరిలేని లోటు తెలుస్తోంది. సమస్యల పరిష్కారానికి ఆయనలా కృషి చేయాలి’’ అన్నారు. కార్యక్రమంలో ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, రాజావన్నెంరెడ్డి, రాజేంద్రకుమార్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, వంశీరామరాజు, దాసరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.