ఇష్టమైనది కావాలంటే.. పోరాటం చేయాల్సిందే

‘‘నటుడు కావాలనుకొన్నప్పుడు భయమేసింది. అవుతానా కానా అని! అలా మనందరిలోనూ రకరకాల భయాలుంటాయి. దాన్ని వదిలేస్తేనే మనం గెలుస్తాం. మనకు ఇష్టమైన దానికోసం పోరాటం చేయాల్సిందే. అప్పుడే అది మన దగ్గరికొస్తుందని చెప్పే ప్రయత్నమే మా చిత్రం’’ అన్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. రష్మిక కథానాయిక. భరత్‌ కమ్మ దర్శకుడు. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి (సి.వి.ఎం), యష్‌ రంగినేని నిర్మాతలు. జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరకర్త. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో సంగీత విజయోత్సవం జరిగింది. చిత్రంలో ఏ సందర్భంలో ఏ పాట వస్తుందో చెబుతూ, వాటిని వినిపిస్తూ నృత్యం చేశారు చిత్ర నాయకా నాయికలు విజయ్‌, రష్మిక. అనంతరం విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘మన జీవితాల్లో అందరం ఎవరి పోరాటం వాళ్లు చేస్తుంటాం. భయం వదిలేస్తే ఎవరు అడ్డుకున్నా జయము నీదేలే అని ఇందులో పాట ఉంటుంది. అది నేను నమ్మాను. అందుకే ఈ చిత్రం చేశా. ఈ సంగీతోత్సవం చేయాలనుకొన్నప్పుడు భయపడ్డా. కానీ దాన్ని వదిలేయడంతోనే ఈ వేడుక జరిగింది. బెంగళూరులో మొదలుపెట్టి ఆ తర్వాత కొచ్చి, చెన్నైల్లో వరుసగా ఈ వేడుకల్ని జరిపాం. ప్రతిచోటా ప్రేక్షకుల్ని చూస్తున్నప్పుడు ఇంత ప్రేమ ఇస్తున్నందుకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలా అనిపించింది’’ అన్నారు. రష్మిక మాట్లాడుతూ ‘‘నేనేం ఇష్ట పడ్డానో దానికోసం పోరాటం చేశాను. అందుకే ఇక్కడ ఉన్నా. నాకు నటనంటే ఇష్టం, సినిమా రంగంలోకి వెళతానంటే అందరూ వద్దని చెప్పారు. సినిమా రంగం అంత శ్రేయస్కరం కాదు, ఎందుకు అంత కష్టపడటం ఇంట్లోనే కూర్చో అన్నారు. కానీ నేను పోరాటం చేశా, కుటుంబ సభ్యుల్ని ఒప్పించా. అలా ప్రతి ఒక్కరూ కోరుకొన్న దానికోసం పోరాటం చేయాలి. ప్రతి అమ్మాయి ఈ సినిమా చూడాలి’’ అన్నారు. ఈ వేడుకలో నాయకానాయికలతో పాటు యువతరం ఆడిపాడుతూ కార్యక్రమాన్ని ఆస్వాదించారు. అగ్ర దర్శకుడు రాజమౌళి తనయ మయూఖ కూడా ఈ వేడుకలో సందడి చేశారు. కార్యక్రమంలో చెర్రీ, అనిల్‌తో పాటు చిత్రబృందం పాల్గొంది.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.