ద్వితియార్థం ఎవ్వరి అంచనాలకు అందదట!

‘డిటెక్టివ్‌ సాయి శ్రీనివాస తెలివితేటలతో అంతుపట్టని కేసుని చేధించిన విధానానికి చిత్రరూపమే మా ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’’ అన్నారు నవీన్‌ పొలిశెట్టి. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నవీన్‌ మాట్లాడుతూ ‘‘ఈ కథ వినగానే ఆశ్చర్యపోయా. టైటిల్‌ కూడా నచ్చింది. ద్వితీయార్థం ఎవ్వరి అంచనాలకి అందదు. ఈ సినిమా చూశాక మీకు నచ్చితే ‘సినిమా బాగుంది’ అని మాత్రమే చెప్పండి. ఈ మలుపుల గురించి ఎవ్వరికీ చెప్పొద్దు. ముందే తెలిసిపోతే చూడబోయేవాళ్లు ఆ థ్రిల్‌ని ఆస్వాదించలేరు. కథ అవసరం మేరకే లవ్‌ ట్రాక్‌ ఉంది. ‘డిటెక్టివ్‌ అంటే ఇలానే ఉంటాడు’ అనే నియమాన్ని చేధిస్తూ కొత్తతరహాలో మలిచాడు దర్శకుడు. నా సంభాషణల్ని నెల్లూరు యాసలో పలికాను. నటీనటులు, సాంకేతికనిపుణులు అంతా తమ పని తాము చేశార’’ని నవీన్‌ తెలిపారు. ‘‘మాది హైదరాబాద్‌. నాన్న వ్యాపార వేత్త, అమ్మ బ్యాంక్‌ ఉద్యోగి. ఇంటర్‌ వరకూ ఇక్కడే చదివా. ఎనిమిదో తరగతి నుంచే సినిమాలు, నాటకాల పిచ్చి. థియేటర్‌ ఆర్ట్స్‌ చేశా. సామాజిక మాధ్యమాల్లో సొంతంగా వీడియోలు చేసి ప్రదర్శించా. భూపాల్‌లో ఇంజనీరింగ్‌ చేశాక, ముంబాయి వెళ్లా. అక్కడ ‘హానెస్ట్‌ వెడ్డింగ్స్‌’, ‘ఇంగ్లిషు ఇంటర్వ్యూ’, ‘హాఫ్‌ డే’ వీడియోలతో మంచి పేరు తెచ్చుకున్నాను. వీటితో అక్కడా, ఇక్కడా పరిశ్రమలో నా గురించి బాగా తెలిసింది. ఈ దర్శకుడు పిలిచి కథ చెప్పారు. నచ్చింది. తర్వాత ఇద్దరం కలిసి దాన్ని పకడ్బందీగా తయారుచేశాం. నిర్మాతకి నచ్చడంతో సెట్స్‌కెక్కింది. హిందీలోనూ అవకాశాలు వచ్చాయి. నితీష్‌ తివారి దర్శకత్వంలో ‘చిచోరీ’లో నటించాను. ప్రస్తుతం ఒక హిందీ, ఒక తెలుగు చిత్రంలో నటించే అవకాశం దక్కింద’’న్నారు.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.