ధనుష్‌.. సేతుపతిల్లా..

రుద్రాక్ష, ధన్య బాలకృష్ణ నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘హల్‌ చల్‌’. శ్రీపతి కర్రి దర్శకుడు. గణేష్‌ కొల్లూరి నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు రుద్రాక్ష. ‘‘చిత్రసీమలోకి అడుగుపెట్టే ప్రతిఒక్కరూ హీరో అవ్వాలనే లక్ష్యంతోనే వస్తుంటారు. కానీ, కొన్ని భయాల వల్ల బయటకి చెప్పుకోరంతే. నేనూ అలా వచ్చిన వాడినే. కానీ, ముందు పరిశ్రమ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో సహాయ నటుడిగా చేశా. ఈ క్రమంలోనే ‘బొమ్మరిల్లు’, ‘షాక్‌’, ‘హైదరాబాద్‌ నవాబ్స్‌’ చిత్రాలు చేశా. నిఖిల్‌తో కలిసి చేసిన ‘యువత’తో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నా. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపును సరిగా ఉపయోగించుకోలేక పోయా. ఇక కథానాయకుడిగా మారదామనుకున్నాక ఓ వైవిధ్యమైన కథాంశాంతోనే తెరపైకి రావాలనుకున్నా. ‘హల్‌చల్‌’తో అది నెరవేరినట్లయింది. నేనిందులో మద్యం అనుకోని ఓ డ్రగ్‌ తాగుతా. దీనివల్ల నిజానికి భ్రమకి మధ్య తేడా తెలియని పరిస్థితుల్లో కొన్ని గమ్మత్తైన పరిస్థితులు ఎదుర్కొంటా. అవేంటన్నదే చిత్ర కథాంశం. చక్కటి కామెడీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. రకరకాల కారణాల వల్లే సినిమా ఆలస్యమైంది. దీనికి తోడు ప్రచార కార్యక్రమాలు అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో మేమనుకున్నంత స్థాయిలో సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లలేకపోయాం. కానీ, సినిమా చూసిన ప్రతిఒక్కరూ కథలోని వైవిధ్యతను మెచ్చుకోవడం సంతోషాన్నిచ్చింది. నా నటన పరంగానూ మంచి మార్కులే పడ్డాయి. ఈ పద్నాలుగేళ్ల సినీ ప్రయాణం చాలా అనుభవాలు నేర్పింది. సినిమా తీయడం ఒకెత్తైతే.. దాన్ని ప్రేక్షకులకు చేరువ చేయడం మరొకెత్తు. ఇందులోని కష్టాన్ని ‘హల్‌చల్‌’తో నేను స్వయంగా తెలుసుకోగలిగా. కాబట్టి నా తర్వాతి చిత్ర విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఓ సరికొత్త థ్రిల్లింగ్‌ కథాంశంతో రూపొందబోయే ఆ చిత్రం ఫిబ్రవరి నుంచి సెట్స్‌పైకి వెళ్లబోతుంది. ఏది ఏమైనా ధనుష్, విజయ్‌ సేతుపతిల్లా వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.