దిల్‌రాజు... తెలుగు సినిమా బీసీసీఐ లాంటివారు!

‘నేను ఏ సినిమా చేసినా... ‘ఇది ఐదేళ్లకు పాతబడిపోతుందా? ఆ తరానికి నచ్చుతుందా?’ అని ఆలోచిస్తుంటాను. కానీ ‘జెర్సీ’ మాత్రం ఎప్పటికీ పాతబడని సినిమా’’ అన్నారు నాని. ఆయన కథానాయకుడిగ నటించిన చిత్రమిది. శ్రద్దా శ్రీనాధ్‌ నాయిక. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మాత. ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ ‘‘సినిమా విడుదల రోజే దిల్‌రాజు గారి నుంచి ఫోన్‌ వచ్చిందంటే ఆ సినిమా విజయవంతమైనట్టే. ‘జెర్సీ’ విషయంలో ఇదే జరిగింది. ‘జెర్సీ’ సినిమాలో అర్జున్‌ కోసం బీసీసీఐ అభినందన సభ ఏర్పాటు చేస్తుంది. అలా దిల్‌రాజు గారు మాకో సభ ఏర్పాటు చేశారు. నా దృష్టిలో ఆయన తెలుగు సినిమా బీసీసీఐ. కథలో నిజాయతీ ఉంటేనే సరిపోదు. ఆ కథని చూపించే దర్శకుడిలోనూ ఉండాలి. గౌతమ్‌లో అది పుష్కలంగా ఉంది. తను గొప్ప దర్శకుడిగా ఎదుగుతాడని నా నమ్మకం. కెమెరామెన్, సంగీత దర్శకుడు, గీత రచయిత.. ఇలా ప్రతీ ఒక్కరూ కథ చెప్పే ప్రయత్నం చేశారు. సత్యరాజ్‌గారితో పనిచేయడం గొప్ప అనుభవం. బాలనటుడు రోనిత్‌ నటనకు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘నా జీవితంలో తొలిసారిగా ‘మహానటి’ సినిమా చూసిన వెనువెంటనే అశ్వనీదత్‌ కార్యాలయానికి వెళి ్లఅభినందించాను. ఆ తర్వాత మళ్లీ జెర్సీ సినిమా చూడగానే అలాంటి అనుభూతి కలిగింది. కొన్ని సినిమాలే ఇలా హృదయాల్ని కదిలిస్తాయి. నాని అద్భుతమైన నటుడు. పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా ప్రాతిపదికన నాని ఈ సినిమా చేశాడు. మంచి సినిమా కోసం నాని ఈ నిర్ణయం తీసుకోవడం అభినందించదగిన విషయం. ‘జెర్సీ’లాంటి మంచి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. వచ్చినప్పుడు మాత్రం వదలకూడదు’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ ప్రశంస మళ్లీ మరో మంచి సినిమా తీసేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంద’’న్నారు. పి.డి.వి. ప్రసాద్, వెంకటరత్నం, శ్రద్దా శ్రీనాధ్, బ్రహ్మాజీ, ప్రవీణ్, కమల్, రోనిత్‌ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.