మరో ‘డిస్కోరాజా’ రావొచ్చు..
‘డిస్కోరాజా' చిత్రీకరణ సమయంలో నేనెంత ఎంజాయ్‌ చేశానో.. అంతకుమించి మీరు ఎంజాయ్‌ చేస్తారు'' అని అన్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'డిస్కోరాజా'. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేశ్‌, తాన్య హోఫ్‌ కథానాయికలు. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. హైదరాబాద్‌లో ఆదివారం ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. ''చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన పాత్రలను ఆనంద్‌ నాకు చెప్పారు. అందుకే వెంటనే సినిమాకు ఓకే చెప్పాను. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మరీ చేశా. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో నేను ఎంతో ఎంజాయ్‌ చేశాను. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు అంతకంటే ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సీక్వెల్‌ కూడా ఉంటుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌తో ఇది నాకు పదకొండో సినిమా. పాటలు ఎంత హిట్టయ్యాయో మీకు తెలిసిందే. సినిమాటోగ్రాఫర్‌ కార్తీక్‌ ఘట్టమనేని సినిమాకు నిజమైన ఆస్తి. చాలా బాగా పని చేశాడు. ఈ సినిమాలో సైఫై సెట్‌ అద్భుతం. ఆ సెట్‌ను అందరూ బాగా వినియోగించుకున్నారు. ప్రొడ్యూసర్‌ రామ్‌ తల్లూరితో ఇది రెండో సినిమా. మొదటి సినిమా అనుకున్న ఫలితం తేలేకపోయినా ఈ సినిమా మాత్రం మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. రచయిత అబ్బూరి రవి నా సినిమాలకు నన్ను దృష్టిలో పెట్టుకొని కథ రాస్తారు. ఇక పాటల విషయంలో శాస్త్రి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు'' అని అన్నారు.


దర్శకుడు ఆనంద్‌ మాట్లాడుతూ.. ''నా కెరీర్‌లో ఇది ఒక మైలురాయి. టైగర్‌ సినిమాకు దర్శకత్వం వహించిన సమయంలో రవితేజగారు నాకు ఫోన్‌ చేసి ప్రత్యేకంగా నన్ను అభినందించారు. నాలాంటి కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం నిజంగా రవితేజ గొప్పతనం. ప్రతి ఒక్క దర్శకుడు కనీసం ఒక్క సినిమానైనా చేయాల్సిన హీరో రవితేజ'' అని ఆయన అన్నారు. గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ ''డిస్కోరాజా' అనే టైటిల్‌తోనే సినిమా డైరెక్టర్‌ సగం విజయం సాధించారు. రవితేజలాంటి మాస్‌ హీరో డైరెక్టర్‌కు దొరికితే ఆ సినిమా మామూలుగా ఉండదు. ఇక తమన్‌లాంటి మ్యూజిక్‌ డైరెక్టర్‌తో రవితేజ కలిస్తే ఆ కాంబినేషన్‌ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు'' అని అన్నారు.


అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. '' రవితేజ 'దరువు'కు రైటర్‌గా పని చేశాను. ఆ తర్వాత 'రాజా ది గ్రేట్‌'తో మంచి హిట్‌ సాధ్యమైంది. ఈ సినిమాతో రవితేజకు అంతకు మించిన హిట్‌ వస్తుందని కోరుకుంటున్నా. రవితేజ స్టైల్‌, ఎనర్జీ నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్‌. 'రమణా మాస్‌ మహారాజ్‌ సినిమా వస్తుందిరా..లోడెత్తాలా..'' అని 'సరిలేరు నీకెవ్వరూ' డైలాగ్‌ చెప్పి అలరించారు. ఇలాంటి పాత్ర ఇప్పటి వరకూ ఎప్పుడూ చేయలేదని హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ అన్నారు. తాను కూడా రవితేజ ఫ్యాన్‌ని అని నభా నటేశ్‌ అన్నారు. ''చాలా కాలం తర్వాత తృప్తిగా సినిమా షూటింగ్‌ చేసినట్లు కాకుండా అంతకంటే వందరెట్లు ఎంజాయ్‌ చేసే విధంగా సినిమా చేశాం'' అని సునీల్‌ అన్నారు.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.