వాడి వల్లనే నేనిక్కడున్నా!

‘ఇప్పటిదాకా మా తమ్ముడు సినిమా గురించి మాట్లాడలేదు. ఇక్కడ స్క్రిప్టు ఎంపిక చేసుకోవడం గురించి, థియేటర్‌కి వచ్చేవరకు ఎన్ని కష్టాలుంటాయో తెలియాలని వదిలేశా. తను అమెరికాకి వెళ్లి ఉద్యోగం చేస్తూ ఇంటికి డబ్బు పంపించి సాయం చేశాడు. అందుకే నేనిక్కడ ఉన్నా’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ఆయన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘దొరసాని’. రాజశేఖర్‌, జీవితల తనయ శివాత్మిక కథానాయికగా పరిచయమవుతోంది. మహేంద్ర దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, యష్‌ రంగినేని నిర్మాతలు. ప్రశాంత్‌ విహారి స్వరాలు సమకూర్చారు. చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎప్పుడూ వేదికపై తనదైన శైలిలో మాట్లాడే విజయ్‌ దేవరకొండ తన తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని, ఆయన తొలి సినిమా ప్రయాణాన్ని గుర్తు చేసుకొని కంట తడి పెట్టుకొన్నారు. ‘‘మా తమ్ముడు సినిమా చేస్తా అన్నప్పట్నుంచి నేను తనతో పెద్దగా మాట్లాడలేదు. నీ సినిమా నువ్వు చేసుకో, నేనేం సాయం చేయనని చెప్పా. కానీ తనే కథ విని సినిమా చేశాడు. చిన్నప్పుడు పుట్టపర్తిలో హాస్టల్‌లో ఉంటూ చదువుకొన్నా. నాలుగో తరగతి చదువుతున్నప్పుడు మా తమ్ముడు ఒకటో తరగతిలో చేరాడు. రెండో పీరియడ్‌లోనే మా క్లాస్‌ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆడుకుంటూ ప్రతి ఐదు నిమిషాలకోసారి నేనున్నానా అని చెక్‌ చేసేవాడు. వాడు మూడు రోజులు మా క్లాస్‌లోనే కూర్చున్నాడు. తను సినిమా చేస్తున్నాడని తెలిసి కూడా దాని గురించి ఎప్పుడూ ఆరా తీయలేదు. తనే కష్టపడుతూ క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొన్నాడు. నన్ను ముందస్తు విడుదల వేడుకకి రమ్మని అడిగినప్పుడు కూడా సినిమా చూపించండని చెప్పా. సినిమా చూశాక ఒక మేజిక్‌ సృష్టించారనే అభిప్రాయం కలిగింది. నా తొలి సినిమాకి ఇలా చేయలేకపోయా అనిపించింది. శివాత్మిక అత్యుత్తమ నటి అనిపించుకొంటుంది. ఆనంద్‌ నటన చూసి ఆశ్చర్యపోయా, తన విషయంలో గర్వపడుతున్నా. మహేంద్ర నాకోసం కథ రాస్తున్నా అన్నారు. సిద్ధం కాగానే చేయమని చెప్పా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్‌, జీవిత, నందినిరెడ్డి, రామజోగయ్య శాస్త్రి, తరుణ్‌ భాస్కర్‌, గోరటి వెంకన్న, ప్రశాంత్‌ విహారి, సి.కల్యాణ్‌, వెంకట్‌ సిద్ధారెడ్డి, రాహుల్‌ యాదవ్‌ నక్కా, లగడపాటి శ్రీధర్‌, తేజ, రాజ్‌ కందుకూరి, అనురాగ్‌ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.