దిల్‌రాజు సలహాలు.. దర్శకేంద్రుడి ప్రశంసలు

రాకేశ్‌ వర్రె కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘ఎవ్వరికీ చెప్పొద్దు’. బసవ శంకర్‌ దర్శకత్వం వహించారు. గార్గేయి కథానాయికగా నటించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రానికి ముందు ‘రన్‌ రాజా రన్‌’, ‘పెళ్లిచూపులు’ వంటి హిట్‌ చిత్రాలకు పనిచేశా. కులం సమస్య వల్ల నా స్నేహితుడు ఒకరు ప్రేమలో దారుణంగా దెబ్బతిన్నారు. అతని జీవితంలో జరిగిన ఆ సంఘటనలను స్ఫూర్తిగా తీసుకోని ఈ కథను రాసుకున్నా. తర్వాత స్క్రిప్ట్‌లో పాత్రకు తగ్గట్లుగా రాకేశ్‌ నాకు దొరికారు. 150 మందిని ఆడిషన్‌ చేసి గార్గేయిని కథానాయికగా ఎంపిక చేసుకున్నాం. ఇద్దరూ ఎంతో చక్కగా నటించారు. చిత్ర విజయంలో దిల్‌రాజు సర్‌ సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి. చిత్ర టైటిల్‌ కూడా ఆయన ఆలోచన నుంచి వచ్చిందే. తొలుత ఈ చిత్రానికి మేం ‘నా పెళ్లి ఎవ్వరికీ చెప్పొద్దు’ అని పెట్టాం. కానీ, అదంత క్యాచీగా లేదనడంతో చిన్నగా ‘ఎవ్వరికీ చెప్పొద్దని’ పెట్టాం. మా చిత్రం చూసి రాఘవేంద్రరావు గారు ప్రత్యేకంగా అభినందించడం ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు. ‘‘నాకు చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉంది. అప్పట్లో ఈటీవీలో ‘హృదయం’ అనే సీరియల్లో నటించా. బ్యాచిలర్స్‌ చేయడం మొదలుపెట్టాక లఘ చిత్రాల్లో నటిస్తూనే సినిమా అవకాశాల కోసం అన్వేషణ మొదలుపెట్టా. ఈ ప్రయత్నాల్లోనే ఈ చిత్రంలో చేసే అవకాశం దక్కింది. సినిమా చూసి మా అమ్మానాన్న ‘నీ నుంచి ఇంత చక్కటి నటనను అసలు ఊహించలేదు’ అని ప్రశంసించారు. మిత్రుల నుంచి ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతుండటం సంతోషంగా అనిపిస్తుంది’’ అన్నారు కథానాయిక గార్గేయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.