సంతోషంగా నవ్వుకుంటూ ఇంటికెళ్తారు

‘‘దేశంలోనే అందమైన నగరం విశాఖపట్నం. తెలుగు సినీ పరిశ్రమ ఇక్కడికి తరలిరావల్సిన అవసరం ఉంద’’న్నారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయన ఆదివారం విశాఖ ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన ‘ఎఫ్‌2’ పాటల విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరై తొలి సీడీని ఆవిష్కరించారు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా నటించిన చిత్రమిది. తమన్నా, మెహరీన్‌ కథా నాయికలు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌ నిర్మాతలు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్‌ రాజు మాట్లాడుతూ ‘‘గతేడాది సంక్రాంతికి మూడు సినిమాలు విడుదలై విజయవంతమయ్యాయి. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలన్నీ విజయవంతం కావాలని కోరుకొంటున్నాన’’న్నారు. అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘‘విశాఖపట్నంలోనే ఈ సినిమా కథ రాశాను. ఈ సినిమాతో నాకు లభించిన మరో గొప్ప అవకాశం వెంకటేష్‌తో పనిచేయడం. ఈ సంక్రాంతికి కుటుంబంతో కలిసి ఈ సినిమాకొస్తే అందరూ సంతోషంగా నవ్వుకుని ఇంటికి వెళతార’’న్నారు. దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చూశాక ప్రేక్షకులు తమలో ఉన్న చిరాకునంతా మరిచిపోయి నవ్వుకుంటూ వెళతార’’న్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘విశాఖపట్నంకి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చిన వేడుక ఇది. ఒక్కసారి విశాఖపట్నం చూశాక ఏ ప్రముఖుడైనా సరే ట్వీట్‌ చేయకుండా వెళ్లడం లేదు. ఈ వేడుకలో వెంకటేష్‌ కూడా తప్పకుండా ఇక్కడి స్టూడియోలో ఎక్కువ సినీ నిర్మాణాలు జరిగేలా చూస్తామని చెప్పారు. విశాఖలో ఆడియో వేడుక, విడుదల ముందస్తు వేడుక, చిత్రీకరణలు కానీ చేస్తే ఆ సినిమాలు తప్పకుండా విజయవంతమవుతాయి. చిత్రీకరణలకి అనుకూలంగా ఉండేలా ప్రజలు సహకరిస్తార’’న్నారు. వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ ‘‘నేను చేసే మిగతా సినిమాలు చూసి ఈ పాత్ర నాకు ఎవ్వరూ ఇవ్వరేమో. కానీ అనిల్‌ రావిపూడి ధైర్యం చేసి నాకు ఇచ్చారు. వెంకటేష్‌తో పనిచేయడం గర్వంగా ఉంది. జనవరి 12న మేం సంక్రాంతి అల్లుళ్లుగా వస్తున్నాం’’ అన్నారు. వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘నా గత చిత్రాలన్నింటికన్నా బాగా రెచ్చిపోయి కనిపించేలా నాతో నటింపజేశాడు అనిల్‌ రావిపూడి. విశాఖపట్నం నాకు చాలా దగ్గరైన నగరం. ఇది నాకు బాగా అదృష్టం తెచ్చిన నగరం. జనవరి 12న వస్తున్న మా చిత్రంతో పాటు, బాలకృష్ణ, చరణ్‌, రజనీకాంత్‌ల సినిమాలు కూడా బాగా ఆడాల’’న్నారు. వేడుకలో ‘గిర్రా గిర్రా తిరుగుతోందే బుర్రా...’ అనే పాటకి వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, దేవిశ్రీప్రసాద్‌, దిల్‌రాజు, అనిల్‌ రావిపూడి డ్యాన్సులు వేసి ప్రేక్షకుల్ని అలరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సత్యసాయి శ్రీనివాస్‌, ఆర్‌.డి.రాధాకృష్ణమూర్తి, జిల్లా టూరిజం అధికారి పూర్ణిమ, కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌తో పాటు, కాసర్ల శ్యామ్‌, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.