ఈమధ్య కాలంలో ఇలాంటి చిత్రం రాలేదు
'వెళ్ళిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది' లాంటి చిత్రాలలో తనదైన నటనతో మంచి గుర్తిపు తెచ్చుకున్నారు నటుడు విశ్వక్‌ సేన్‌. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'ఫలక్‌ నుమా దాస్‌'. డి. సురేష్‌ బాబు సమర్పణలో వన్మయి క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించారు. పూర్తిగా హైదరాబాద్‌ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో సలోని మిశ్రా, హర్షిత గౌర్‌, ప్రశాంతి కథానాయికలుగా నటించారు. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ పోలీస్‌ అధికారిగా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యి.. చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''టీజర్‌ చూడగానే తెలిసిపోయింది.. అందరూ కొత్త కుర్రాళ్లు ఈ చిత్రాన్ని ఒక సవాల్‌గా తీసుకొని చాలా కష్టపడి నటించారు. సినిమాలో చాలా పాజిటివ్‌ ఎనర్జీ ఉంది. ఇక విశ్వక్‌ ప్రతి ఫ్రేమ్‌లోనూ తన యాక్టింగ్‌ స్కిల్స్‌ని అద్భుతంగా చూపించారు. ట్రైలర్‌ చాలా బాగుంది. చిత్ర బృందమంతా చాలా బాగా చేసింది. ఇటీవల కాలంలో ఇంతలా యువతరానికి నచ్చే సినిమా రాలేదు. హైదరాబాద్‌లోని వాస్తవ లోకేషన్లంటినీ చాలా చక్కగా కవర్‌ చేశారు. సంభాషణలు బాగున్నాయి. స్క్రిప్ట్‌ ఆసక్తికరంగా ఉంది. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.


హీరో, దర్శకుడు విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.. ''ట్రైలర్‌ కట్‌ చేసినప్పుడు చాలా భయంగా అనిపించింది. టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ట్రైలర్‌కి అంతకన్నా ఎక్కువ స్పందన రావాలి అని అనుకున్నాను. అన్నీ అనుకున్నట్లుగానే మంచి ఆదరణ లభిస్తోంది. మొన్నటిదాకా నాకు కొంత ఒత్తిడి ఉండే... ఇంకా సినిమా ఎవ్వరికీ చూపించలేదని... సినిమా బాగుందని నాకు తెలుసు. అయినా ఎక్కడో కొంత భయం ఐతే ఉంది. తాజాగా సురేష్‌ సర్‌ సినిమా చూసి ప్రశంసించారు. వెంకటేష్‌ సర్‌ది గోల్డెన్‌ హ్యాండ్‌. ఆయన ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రెండు రోజుల్లో విడుదల తేదీ ప్రకటిస్తాం'' అన్నారు. హీరోయిన్‌ ప్రశాంతి మాట్లాడుతూ.. ''ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించే అవకాశం ఇచ్చిన విశ్వక్‌కు ధన్యవాదాలు'' అన్నారు. నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ.. '' సినిమా అద్భుతంగా వచ్చింది. 20 నుంచి 25 సంవత్సరాల వయసుండే 40 మంది కుర్రాళ్లంతా కష్టపడి పని చేశారు. సినిమా వాస్తవికంగా రావాలని అడ్వాన్స్‌ టెక్నాలజీతో చేశారు. హైదరాబాద్‌లో ఇలాంటి ఏరియాలు కూడా ఉన్నాయని ఎవరికీ తెలియనటువంటి 118 బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని చిత్రీకరించాం'' అన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.