పోస్టర్లు చించేశారు: అయినా భయపడేదిలేదు!
* వీడియో వివాదంలో ఫలక్‌నుమా దాస్‌
యువ హీరో విశ్వక్‌ సేన్‌ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఈయన ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా తన సినిమా గురించి కొందరు నెటిజన్లు పెడుతున్న రివ్యూలపై స్పందిస్తూ విశ్వక్‌ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు. ‘‘కొందరు నాటకాలాడుతున్నారు. నేను హైదరాబాద్‌ వస్తున్నా. నా సినిమాను టార్గెట్‌ చేయాలని చూస్తున్నవారి సంగతి చెప్తా’’ అని హెచ్చరిస్తూ ఓ అసభ్యకర పదాన్ని వాడారు. దీంతో ఈ వీడియో కాస్తా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా విశ్వక్‌ ఓ ప్రెస్‌ మీట్‌ను ఏర్పాటుచేసి తాను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన వీడియో గురించి క్లారిటీ ఇచ్చారు.

‘‘మా చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఫ్యామిలీస్‌ కూడా సినిమాను ఎంజాయ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాకు ఓ విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను హీరోగా ఇప్పుడిప్పుడే సినిమాల్లో అడుగుపెట్టాను. కాబట్టి నా చిత్రానికి ప్రచారం కల్పించుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేశాను. కానీ కొందరు వ్యక్తులు కావాలని నేను వాడిన అసభ్య పదాన్ని మాత్రమే టార్గెట్‌ చేస్తూ నా సినిమాను దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఏ హీరోనూ ఉద్దేశించి ఆ వీడియో పెట్టలేదు. ఈ విషయం తెలివి ఉన్నవాళ్లకి అర్థమవుతుంది. నన్ను ఓడించాలనుకుంటే నాతో పోటీ పడండి. నేను దేనికైనా రెడీ. కానీ సరైన మార్గాన్ని ఎంచుకోండి. అంతేకానీ నేను అన్న చిన్న మాటను పట్టుకుని జనాలకు నాపై చెడు అభిప్రాయం కలిగించేలా చేయొద్దు. నా సినిమా పోస్టర్లు కూడా చింపేశారు. చాలా బాధేసింది. నేను ఎవ్వరికీ భయపడను. నేను అన్న మాటను పట్టుకుని నన్ను నెగిటివ్‌గా చూపించాలని చూస్తే మాత్రం నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. నా సినిమాలో 80 మంది కొత్తవారిని ఎంచుకున్నాను. వారికి లైఫ్‌ ఇవ్వాలని అనుకున్నాను. హీరో అయిపోవాలన్న ఉద్దేశంతో నేను సినిమా తీయాలనుకుంటే రూ.5 కోట్లు పెట్టి కమర్షియల్‌ సినిమానే తీసుండేవాడిని. కానీ నేను అలా చేయలేదు. ఈ సినిమా ద్వారా కొత్త వారికి మరిన్ని మంచి అవకాశాలు వస్తాయన్న ఉద్దేశంతోనే సినిమా తీశాను’’ అని అన్నారు.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.