సినిమాను భద్రపరచుకోవడం మన బాధ్యత

‘‘సినిమాలు మన జీవితాల్లో అంతర్భాగం. వాటిని భద్ర పరచడం అంటే మన దృశ్యపరమైన చరిత్రను, మన వారసత్వాన్ని, జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవడంతో సమానం’’ అన్నారు ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌. భారతీయ సినిమా వారసత్వ సంపద పరిరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసే ఉద్దేశంతో ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్, ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ఆర్కీవ్స్‌ (ఎఫ్‌ఐఎఎఫ్‌) సంయుక్తంగా హైదరాబాద్‌లో ఈనెల 8 నుంచి 15 వరకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నాయి. ఈ వర్క్‌షాప్‌ ప్రారంభ కార్యక్రమం ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి సినీ ప్రముఖులు రాజమౌళి, చిరంజీవి, నాగార్జున, కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, డి.సురేష్‌బాబు, టి.సుబ్బరామిరెడ్డి, రమేష్‌ ప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్యామ్‌ బెనగల్‌ మాట్లాడుతూ ‘‘మనకెంతో విలువైన సినిమా వారసత్వ సంపద ఉంది. కానీ దాన్ని ఎలా పరిరక్షించుకోవాలో తెలియదు. ఇది బాధాకరమైన విషయం. ఆ పనిని ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ ఎంతో చక్కగా నిర్వహించడంతో పాటు వాటినెలా భద్రపరచాలన్న అంశంపై శిక్షణ ఇస్తోంది. మన సినీ చరిత్రని పరిరక్షించుకోవడం ద్వారా భావి తరాలకు మన సంస్కృతిని అందించగలుగుతాం. 1950ల నాటి ఓ సినిమాను చూస్తే ఆనాటి సంస్కృతిని తెలుసుకునే వీలుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుండాలి. దీనికి ప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలు కావాలి’’ అన్నారు. ‘‘ప్రస్తుతం చిత్రసీమలో చాలా మార్పులొచ్చాయి. డిజిటల్‌ మీడియాలో చిత్రాలు తెరకెక్కిస్తున్నాం. కానీ వాటిని మనం భద్రపరచుకోలేకపోతున్నాం. ఒకప్పుడు ‘మగధీర’ను భద్రపరచమని ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ స్థాపకులు శివేంద్ర నన్నడిగారు. నేను చేస్తా అన్నా. అప్పుడు డిజిటల్‌లో 4కె రిజల్యూషన్‌లో ఉన్న ఆ సినిమా కాల క్రమంలో 2కె రిజల్యూషన్‌కి పడిపోయింది. ఆ చిత్ర నాణ్యత పూర్తిగా తగ్గిపోయింది. కాబట్టి వీటిని మనం కోల్పోకుండా ఉండాలంటే కచ్చితంగా వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది’’ అన్నారు రాజమౌళి.‘‘ఇంత చక్కటి కార్య క్రమంలో పాల్గొనే అవకాశం రావడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. నేను రాజకీయాల్లోకి వెళ్లాక ఓ నిర్మాత నాకు అరుదైన కానుకిచ్చారు. నన్ను స్టార్‌ హీరోగా నిలబెట్టిన ‘ఖైదీ’ నెగిటివ్‌ రైట్స్‌ బహుమతిగా ఇచ్చారు. కానీ, నాకు అవి ఏ ల్యాబ్‌లోనూ దొరకలేదు. ఇది నన్ను చాలా బాధించింది. మనం మన చిత్రాలను పరిరక్షించుకోకపోవడమే దీనికి కారణం. ఈతరంలో ఎంత మందికి రాజ్‌కపూర్, చిత్తూరు నాగయ్య, ఎల్వీ ప్రసాద్‌ లాంటి వాళ్లు తెలుసు. వాళ్లందించిన విలువైన సినీ సంపదను భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది’’ అన్నారు చిరంజీవి. ‘‘ఈ బృహత్తర కార్యక్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ భాగమైనందుకు సంతోషంగా ఉంది. నాన్న అక్కినేని నాగేశ్వరరావు దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించారు. కానీ, వాటిలో మేం కొన్నింటిని కూడా భద్రపరచుకోలేకపోయాం. ఇది నన్ను బాధించింది. కనీసం వాటిని దాచుకోవాలన్న ఆలోచన కూడా మాకెప్పుడూ రాలేదు. నా ‘గీతాంజలి’, ‘శివ’ చిత్రాల నెగిటివ్‌ రీల్స్‌ ఇప్పుడు లేవు. కానీ ఇక నుంచైనా మన సినీ వారసత్వ సంపదను కాపాడుకోవాలి. దీనికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అవసరం’’ అన్నారు నాగార్జున. కార్యక్రమంలో శివేంద్ర, జయేష్‌ రంజన్‌ పాల్గొన్నారు.

(చిత్రమాలిక కోసం క్లిక్‌ చేయండి)


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.