మహిళల కబడ్డీ కోచ్ గా మారుతోన్న గోపీచంద్..

గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. శ్రీనివాస సిల్వర్ స్కీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఈ చిత్ర ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్ నివ్వగా.. రాజమండ్రి ఎం.పి. మార్గాని భరత్‌రామ్‌ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం గోపీచంద్ మాట్లాడుతూ.. ''పవన్, శ్రీనివాస్‌లతో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నా. అది ఇన్నాళ్లకు కుదిరింది. నా కోసం చాలా మంచి కథ తెచ్చారు. 'గౌతమ్ నంద' తర్వాత సంపత్ తో చేస్తున్న చిత్రమిది. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. తమన్నాతో చేస్తున్న తొలి చిత్రమిది. ఆమె పాత్ర కూడా ఎంతో బాగుంటుంది'' అన్నారు.''మరో సినిమా చేయడానికి ఎందుకింత సమయం తీసుకుంటున్నారు' అని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. నిజానికి ఈ స్క్రిప్ట్ వల్లే ఆలస్యమైంది. నేను చేస్తున్న తొలి క్రీడా నేపథ్య చిత్రమిది. దీనికోసం చాలా పరిశోధన చేశాను. గోపీచంద్ ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా కనిపిస్తారు. తమన్నా తెలంగాణ మహిళల కబడ్డీ జట్టుకు కోచ్‌గా దర్శనమిస్తుంది. ఈ సినిమా కోసం 25 మంది కబడ్డీ ఆటగాళ్లతో పాటు మరికొంత మంది కొత్త నటులను తీసుకున్నాం. ప్రస్తుతం వాళ్లకు ఆటలో శిక్షణ ఇస్తున్నాం. బలమైన విజువల్స్, భావోద్వేగాలతో నిండి ఉన్న చిత్రమిది'' అన్నారు సంపత్ నంది.తమన్నా మాట్లాడుతూ.. ''సంపత్ తో చేస్తున్న మూడో చిత్రమిది. కథ చెప్పినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. ఆయన నాకు గతంలో 'రచ్చ'లాంటి మంచి గుర్తుపెట్టుకోదగ్గ చిత్రాన్ని ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు అంతటి మంచి పాత్రను ఇచ్చారు. గోపీతో నేను చేస్తున్న తొలి చిత్రమిది. ఆయనతో చేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నా. ఆయన చాలా అద్భుతమైన నటులు'' అంది. ‘‘గోపీచంద్‌తో సినిమా చేయాలని 8ఏళ్లుగా అనుకుంటున్నాం. చాలా కథలు వినిపించినా ఏదీ కుదరలేదు. కానీ, ఈ కథ చెప్పగానే షూటింగ్‌కు ఎప్పుడు రమ్మంటారు అన్నారు గోపి. ఈ కథ చెప్పగానే తమన్నా కూడా ఇలాగే అన్నారు. మంచి టీం కూడా కుదిరింది. అన్ని రకాల వాణిజ్య అంశాలు ఉన్న చిత్రమిది. నవంబరు నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్తాం. ఏప్రిల్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు నిర్మాత శ్రీనివాసా.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.