ఏడు వింతలు చూస్తారు!

‘‘కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘7’. ఒకసారి ఈ సినిమాని చూడమని నిర్మాత రమేష్‌ వర్మ చెప్పడంతో చూశా. నాకు చాలా బాగా నచ్చింది. దాంతో వెంటనే ప్రదర్శన హక్కులు తీసుకున్నా. ఇందులో కొత్త హవీష్‌ని చూస్తార’’న్నారు నిర్మాత అభిషేక్‌ నామా. ఆయన విడుదల చేస్తున్న చిత్రమిది. హవీష్‌ కథానాయకుడిగా నటించారు. నిజార్‌ షఫీ దర్శకుడు. నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్‌, త్రిథా చౌదరి, ఆదితి ఆర్య, పూజిత పొన్నాడ కథానాయికలు. రమేష్‌ వర్మ నిర్మాత. రెహమాన్‌, సుంకర లక్ష్మి కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 6న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించింది. హవీష్‌ మాట్లాడుతూ ‘‘కథ విన్నప్పుడు ఎంత ఆసక్తిగా అనిపించిందో, ట్రైలర్‌ చూస్తున్నప్పుడూ అదే అనుభూతి కలిగింది. రమేష్‌ వర్మ మంచి కథ ఇచ్చారు. నిజార్‌ షఫీ అనుకొన్న కథని అనుకున్నట్టుగా తెరపైకి తీసుకొచ్చారు. చైతన్య భరద్వాజ్‌ సంగీతం బాగా కుదిరింది. సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అన్నారు. ‘‘నేను నటించిన సినిమాలు రెండు నెలలకి ఒకటి చొప్పున విడుదలవుతున్నాయి. వాటన్నింటిలోకి ఈ చిత్రం ప్రత్యేకం. నాకు బాగా నచ్చిన రమ్య అనే పాత్రని పోషించా’’ అన్నారు నందిత శ్వేత. ఈ కార్యక్రమంలో కథానాయికలు త్రిథా, పూజితా పొన్నాడ తదితరులు పాల్గొన్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.