‘హిట్‌’ అవుతుందనే ఈ పేరు పెట్టాడు

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హిట్‌’. ‘ది ఫస్ట్‌ కేస్‌...’ అనేది ఉపశీర్షిక. రుహానీశర్మ నాయిక. శైలేష్‌ కొలను దర్శకుడు. ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాత. వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై కథానాయకుడు నాని సమర్పిస్తున్నారు. ఈ నెల 28న విడుదలవుతోంది. ఆదివారం హైదరా బాద్‌లో విడుదల ముందస్తు వేడుక జరిగింది. కె.రాఘవేంద్రరావు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, అనుష్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘నాని నిర్మాతగా ‘అ!’ అంటూ మొదలు పెట్టాడు. రెండో సినిమాకే ‘హిట్‌’ అంటున్నాడు. ఎంత నమ్మకం లేకపోతే ఈ పేరు పెట్టుంటాడు.తన ఫ్లాప్‌ చిత్రాల్లోని తప్పులు, హిట్‌ సినిమాల్లోని ఉత్తమమైనవన్నీ దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా చేశాడు. కచ్చితంగా హిట్‌ అవుతుందని నాని సినిమాకి ఈ పేరు పెట్టాడ’’న్నారు.


రాజమౌళి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకి అన్నీ కుదిరాయి. టీజర్, ట్రైలర్‌ స్టైలిష్‌గా ఉన్నాయి. ఈ ఆలోచన బాగుంది. ఆంగ్ల చిత్రం ‘2012’కి సంబంధించిన స్నీక్‌పీక్‌ని తొలిసారి చూశాను. అలాంటి ఆలోచనతోనే ఇందులో కూడా సినిమాలోని ఓ కీలక ఘట్టాన్ని విడుదల చేశారు. దీని తర్వాత ఏంజరుగుతుందో సినిమాలో చూడాలనే ఆసక్తితో ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారు. ఈ సినిమా తప్పకుండా హిట్టవ్వాలి. ది ఫస్ట్‌కేస్‌... అని ఉపశీర్షిక పెట్టారు. సెకండ్‌ కేస్, థర్డ్‌ కేస్‌ అంటూ మరిన్ని కేసులతో ఈ సినిమా మరిన్ని భాగాలుగా కొనసాగాలని కోరుకుంటున్నా’’ అన్నారు.


అనుష్క మాట్లాడుతూ ‘‘నాని, ప్రశాంతి నా కుటుంబ సభ్యులతో సమానం. ఈ సంస్థలో ‘అ!’ తర్వాత రానున్న సినిమా గురించి ఎదురు చూస్తున్నా. వాళ్లు చాలా తపనతో సినిమా చేశార’’న్నారు. రానా మాట్లాడుతూ ‘‘కొత్త కథలు రావాలని తరచూ మాట్లాడుతుంటాం. నాని, ప్రశాంతి ఆ ప్రయత్నం చేస్తున్నారు. నాకు బాగా ఇష్టమైన వ్యక్తులు వీళ్లు. ఈ చిత్రంతో మంచి విజయం దక్కాలి’’ అన్నారు. నాని మాట్లాడుతూ ‘‘శైలేష్‌ ‘హిట్‌’ కథ చెప్పినవెంటనే చేయాలి అనిపించింది. సినిమా చూశాక తను ఇక ఉద్యోగాన్ని వదిలేసి రావొచ్చని చెబుతున్నా. విశ్వక్‌ నటనని చూశాక తను ఏ పాత్రయినా చేయగలడనిపించింది. 28న ప్రేక్షకులకు నాణ్యమైన మంచి సినిమాని అందించబోతున్నాం’’ అన్నారు. ‘‘కథ రాసి నానికి ఇస్తే, ఆయన వేరే దర్శకుడితో తీస్తారనుకున్నా. బాగా కథ రాశావు కదా, నువ్వే చేయి అన్నారు. అప్పుడు దర్శకత్వం నేర్చుకుని ఈ సినిమా చేశా’’ అన్నారు శైలేష్‌. వేదికపై అనుష్క సరదాగా విల్లు ఎక్కుపెట్టి బాణం వేస్తే, రాజమౌళి గొడ్డలి పట్టుకున్నారు. కార్యక్రమంలో కీరవాణి, నందినిరెడ్డి, సునీల్, అల్లరినరేష్, భానుచందర్, దిల్‌రాజు, నవదీప్, సందీప్‌కిషన్, వివేక్‌సాగర్, మణికందన్, గ్యారీ, తరుణ్‌భాస్కర్, కార్తికేయ, లక్ష్మీ ప్రసన్న, సాయికొర్రపాటి, రాజ్‌ కందుకూరి, రాహుల్‌ రామకృష్ణ, సుశాంత్, రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు పాల్గొన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.