ముగ్గురు సహాయకులను కోల్పోవడం బాధాకరం
కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారతీయుడు-2 సినిమా సెట్స్‌లో ఘోర ప్రమాదం సినీ ప్రపంచాన్ని విషాదంలో పడేసింది. బుధవారం రాత్రి చిత్రీకరణలో భాగంగా చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో లైటింగ్‌ కోసం సెట్స్‌ వేస్తున్న క్రమంలో  150 అడుగుల ఎత్తు నుంచి  క్రేన్‌  తెగిపడి టెంట్‌పై పడింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో శంకర్‌ వ్యక్తిగత సహాయకుడు మధు(29), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ(34), సహాయకుడు చంద్రన్‌  ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను చెన్నైలోని పునమలై ప్రధాన రహదారిలో గల సవిత ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మృతదేహాలను రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో 1996లో విడుదలై బ్లాక్‌బ్లాస్టర్‌ విజయం సాధించిన భారతీయుడు చిత్రానికి కొనసాగింపుగా భారతీయుడు-2 చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌, సిద్ధార్థ, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాష్‌కరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


ప్రమాదం నా మనసుని కలిచివేసింది: కమల్‌హాసన్‌

సెట్స్‌లో జరిగిన ప్రమాదంపై కమల్‌హాసన్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘‘ఈ ఘటన నా మనసుని కలిచివేసింది. ముగ్గురు సహాయకులను కోల్పోవడం బాధాకరం. నా బాధ కన్నా వారిని కోల్పోయిన కుటుంబాల బాధ ఎన్నో రెట్లు ఎక్కువ’’ అని ఆయన పేర్కొన్నారు. మృతుల కుంటుబాలకు సానుభూతి తెలిపారు.

జీవితం విలువ తెలిసింది: కాజల్‌
 నిన్న రాత్రి జరిగిన క్రేన్‌ ప్రమాదంతో నేనింకా షాక్‌లోనే ఉన్నాను. కేవలం కొన్ని క్షణాల వ్యవధిలో నేను ప్రమాదం నుంచి తప్పించుకుని ఈరోజు మీకు ఇలా ట్వీట్‌ చేయగలిగాను. ఆ ఒక్కక్షణం.. నాకు కాలం, జీవిత విలువ తెలిసింది. 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.