నా స్కూలు రోజుల్లో అమ్మాయిలే లేరు: రాఘవేంద్రరావు

శర్వానంద్, సమంత జంటగా నటించిన చిత్రం ‘జాను’. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘చాలా కాలం తరవాత ఓ మంచి ప్రేమకథ చూశాను. శర్వా, సమంత పోటీ పడి నటించారు. క్లైమాక్స్‌ చూస్తే ఏడుపొచ్చింది. ఈ సినిమా చూసినవాళ్లందరికీ తమ స్కూలు రోజులు గుర్తొస్తాయి. నా కాలేజీ, స్కూలు జీవితాల్లో అమ్మాయిలే లేరు. సినిమాల్లోకి వచ్చాక అమ్మాయిలే.. అమ్మాయిలు’’ అని చమత్కరించారు. దిల్‌ రాజు మాట్లాడుతూ ‘‘సమంత, శర్వానంద్‌ల నటన అందరినీ కదిలిస్తోంది. ప్రేక్షకులు థియేటర్ల నుంచి బరువెక్కిన హృదయాలతో బయటకు వస్తున్నార’’న్నారు. నందినిరెడ్డి మాట్లాడుతూ ‘‘తెలుగు సినీ పరిశ్రమ తరఫున శర్వానంద్‌కి క్షమాపణలు చెబుతున్నా. ఎందుకంటే తన ప్రతిభకు తగిన స్క్రిప్టు ఇప్పటి వరకూ రాయలేకపోయాం. నేను సినిమాలు చూస్తున్నప్పుడు అస్సలు ఏడవను. కానీ ‘జాను’ పతాక సన్నివేశాలు కంటతడి పెట్టించాయ’’న్నారు. సమంత మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ట్వీట్, ప్రతి రివ్యూ నన్ను ఉత్తేజపరిచాయి. ప్రేక్షకులకు మంచి అనుభూతుల్ని అందించే చిత్రమిద’’న్నారు. శర్వానంద్‌ మాట్లాడుతూ ‘‘నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా. రాఘవేంద్రరావు గారు ‘జాను’ని ‘గీతాంజలి’, ‘పదహారేళ్ల వయసు’ చిత్రాలతో పోల్చినప్పుడు మరింత గర్వంగా అనిపించింద’’న్నారు.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.