‘కల్కి’ సాగించే థ్రిల్లింగ్‌ అన్వేషణ

‘‘ప్రవీణ్‌ సత్తారు ‘గరుడవేగ’తో నాకు గొప్ప విజయం దక్కింది. దానికి మించిన ఫలితం ‘కల్కి’తో అందుతుందని నమ్ముతున్నా’’ అన్నారు రాజశేఖర్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కల్కి’. సి.కల్యాణ్‌ నిర్మాత. ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. ఈనెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో ప్రవీణ్‌ సత్తారు ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘కల్కి’ గొప్ప విజయాన్ని అందుకుంటుందనిపిస్తోంది. ప్రశాంత్‌ చక్కగా తెరకెక్కించార’’న్నారు. రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు ఈ సినిమాలో మూడు రీళ్లు చూశా. నాకే తరవాత ఏం జరుగుందా అనే ఆసక్తి కలిగింది. ప్రవీణ్‌తో ‘గరుడవేగ 2’ త్వరలో తెరకెక్కనుంది. సరికొత్త కథాకథనాలతో నడిచే సినిమాల్ని యువదర్శకులతో చేయాలని కోరికగా ఉంది’’ అన్నారు. ప్రశాంత్‌వర్మ మాట్లాడుతూ ‘‘కల్కి’ సరికొత్త కోణంలో నడుస్తాడు. 1983 ప్రాంతంలో జరిగే కథ. ఓ అంతుపట్టని విషయంలో కథానాయకుడు సాగించే అన్వేషణ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. తన పాత్రకి రాజశేఖర్‌ ప్రాణం పోశార’’న్నారు. ‘‘అన్ని వర్గాలకీ నచ్చేలా ఉంటుంది. అంచనాల్ని అధిగమిస్తుంద’’న్నారు సి.కల్యాణ్‌. కార్యక్రమంలో జీవిత తదితరులు పాల్గొన్నారు.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.