కొంతమంది నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు

‘‘నేను ఇకపై ఎంపిక చేసుకొనే కథలమీద ‘గుణ 369’ ప్రభావం ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టినా రాని బాధ్యతగల నటుడనే పేరు ఈ సినిమాతో నాకొచ్చింది’’ అన్నారు కార్తికేయ. ఆయన హీరోగా, అర్జున్‌ జంధ్యాల తెరకెక్కించిన చిత్రం ‘గుణ 369’. అనిల్‌ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మాతలు. ప్రవీణ కడియాల సమర్పించారు. చిత్రబృందం సోమవారం విజయోత్సవాన్ని నిర్వహించింది. కార్తికేయ మాట్లాడుతూ ‘‘సినిమా చూసి కొంతమంది మహిళలు నన్ను పట్టుకొని ఏడ్చినప్పుడు, వాళ్లకి ఈ కథ ఎంతగా చేరువైందో అర్థమైంది. మా అమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకొన్నారు. నాకు ధైర్యాన్నిచ్చిన చిత్రమిది’’ అన్నారు. ‘‘నిర్మాతల నమ్మకం నిజమైనందుకు ఆనందంగా ఉంది. సినిమా పంపిణీదారులు, ప్రదర్శనకారులు కళ్లల్లో సంతోషం చూడటం తృప్తినిచ్చింది’’ అన్నారు దర్శకుడు. ప్రవీణ మాట్లాడుతూ ‘‘మనసుల్లో నిలిచిపోయే సినిమాల్లో ‘గుణ 369’ ఒకటి’’ అన్నారు. ఈ కార్యక్రమంలోనటుడు మహేష్‌, సంగీత దర్శకుడు చైతన్‌ తదితరులు పాల్గొన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.