‘కౌసల్య’ నా జీవితాన్ని మార్చేసింది!

ఐశ్వర్య రాజేష్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రధారి. భీమినేని శ్రీనివాసరావు దర్శకుడు. వల్లభ నిర్మాత. కె.ఎస్‌.రామారావు సమర్పకులు. ఈ సినిమా విడుదల ముందస్తు వేడుక మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ ‘‘ప్రచార చిత్రం నాకు నచ్చింది. కథ, కథనాలు నిజ జీవితానికి దగ్గరగా ఉన్నాయి. పిల్లల కలలకు అమ్మానాన్నలు రెక్కలు ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి మరింత మంది మహిళా క్రీడాకారులు రావాలి. ఆడ, మగ పిల్లల మధ్య ఎలాంటి తారతమ్యం చూపించకుండా అమ్మాయిలకు సమాన అవకాశాలు ఇవ్వాలి. మా అమ్మ ఈ సినిమా తమిళ వెర్షన్‌ చూసి గొప్పగా చెప్పారు. తెలుగు సినిమా నేను చూస్తా. నాతోటి క్రీడాకారులకు ఈ సినిమా చూడమని చెప్పా’’ అన్నారు. రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో హృద్యమైన సన్నివేశాలతో పాటు మంచి వినోదం ఉంటుంది. తండ్రీకూతుళ్ల బంధాన్ని బాగా చూపించార’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘తమిళంలో ఎంత ప్రేమించి ఈసినిమా తీశారో, మేం అంతకంటే ఎక్కువగా ప్రేమించి తెరకెక్కించాం. ఐశ్వర్య రాజేష్‌కి కన్నీరు పిలిస్తే పలుకుతుంది. అంత మంచి నటి. తన నటన చూస్తుంటే నాకు ఏడుపొచ్చింది’’అన్నారు. ఐశ్వర్య మాట్లాడుతూ ‘‘25 సినిమాల తరవాత నాకు ‘కణ’ అనే మంచి సినిమా వచ్చింది. నా జీవితాన్ని మార్చింది. తెలుగు సినిమా ఎప్పుడు చేస్తావు? అని అడిగేవారు. సరైన సినిమా కోసం ఎదురు చూశా. అదే ‘కౌసల్య...’తో దక్కింది. కళ్లు మూసి తెరిచేలోగా ఈ సినిమా తీసేశారు కె.ఎస్‌.రామారావు. ఈ కథకు భీమనేని వంద శాతం న్యాయం చేశార’’న్నారు. కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ‘‘ఐశ్వర్య చూపించిన ‘కణ’ టీజర్‌ చూసి షాకయ్యా. ఆ సినిమా తెలుగులో తీయాలని అప్పుడే అనుకున్నా. క్రికెట్‌ ఎంత బాగా చూపించారో, రైతుల సమస్య కూడా అంతే గొప్పగా చూపించారు. ప్రతి సన్నివేశాన్నీ సంగీతంతో మేళవించి చెప్పడం నాకు బాగా నచ్చింది. ఇవన్నీ చూసి ఈ సినిమాని నేను చేయాల్సిందే అనిపించింద’’న్నారు. కార్యక్రమంలో పోకూరి బాబూరావు, సి.కల్యాణ్‌, అరుణ్‌రాజా, అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.