ఆయన మాట వినడం వల్లే ఈ స్థాయిలో ఉన్నా

చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి కారణం ఎల్వీ ప్రసాదే అన్నారు ప్రముఖ నటుడు కృష్ణంరాజు. ఆయన సంపాదించిన ప్రతి పైసానీ చిత్ర పరిశ్రమపైనే పెట్టిన గొప్ప వ్యక్తని కొనియాడారు. శుక్రవారం ఎల్వీ ప్రసాద్‌ 112వ జయంత్యుత్సవాలు హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణంరాజు మాట్లాడుతూ ‘‘భారతీయ చిత్ర పరిశ్రమకి గౌరవం తెచ్చిన వ్యక్తి ఎల్వీ ప్రసాద్‌. దేశం గర్వించదగ్గ కంటి ఆస్పత్రిని కూడా స్థాపించి సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆయనతో నాకు అనుబంధం లేకపోయుంటే సినీ పరిశ్రమని వదిలి వెళ్లిపోయేవాణ్ని. అప్పట్లో నేను నటించిన ‘చిలకా గోరింక’ సినిమా విడుదలై ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. ఆ తర్వాత ‘నేనంటే నేనే’లో అవకాశం వచ్చినా... వ్యతిరేక ఛాయలతో కూడుకున్న పాత్ర కదా అని వద్దనుకున్నా. అదే సమయంలోనే ఎల్వీ ప్రసాద్‌ని కలవగా... పాత్ర ఎలాంటిదైనా నువ్వు ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యావన్నదే ముఖ్యమని హిత బోధ చేశారు. ఆయన మాటలు విని ఆ సినిమా చేశా. అది విజయవంతం కావడంతో పాటు ఆ తర్వాత విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం వచ్చింది. ఆయన కుటుంబంతోనూ నాకు మంచి సాన్నిహిత్యం ఉంద’’న్నారు. ప్రసాద్‌ గ్రూప్స్‌ అధినేత ఎ.రమేష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘సినిమానే జీవితంగా మార్చుకున్నారు మా నాన్న. రూ: వందతో బొంబాయి వెళ్లి అక్కడ గేట్‌ కీపర్‌గా పనిచేసి, అంచలంచలుగా ఎదిగారు. చదువుకోకపోయినా పలు భాషలు నేర్చుకున్నారు. మా నాన్ననే స్ఫూర్తిగా తీసుకొని చిత్ర పరిశ్రమలో మరిన్ని గొప్ప సినిమాలు రావడానికి మా వంతు సహకారం అందిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్, ప్రసాద్‌ సురేటివ్‌ మెంటార్స్‌ ఫిలిం అండ్‌ మీడియా స్కూల్‌ ఎండీ కొవ్వూరి సురేష్‌రెడ్డి, రమేష్‌ ప్రసాద్‌ తనయ రాధా, కృష్ణంరాజు అర్థాంగి శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.