రాజశేఖర్‌పై చిరంజీవి ఆగ్రహం!!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) డైరీ ఆవిష్కరణలో రసాభాస నెలకొంది. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఎన్ని గొడవలు ఉన్నా వాటిని మర్చిపోయి మనందరం కలిసి 'మా' అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. అనంతరం రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా.. హీరో రాజశేఖర్‌ వేదిక పైకి వచ్చి ఆయన చేతిలో నుంచి మైక్‌ లాక్కున్నారు. అంతేకాకుండా సభలో కూర్చున్న కృష్ణంరాజు, మోహన్‌బాబు, చిరంజీవి కాళ్లకు నమస్కారం చేశారు. 'మా'లో గొడవలున్నాయంటూ మరోసారి ప్రస్తావించారు. దీంతో స్టేజ్‌పై ఉన్న చిరంజీవి, మోహన్‌బాబుతోపాటు ఇతర నటీనటులు తీవ్ర అసహనానికి గురయ్యారు. 'మార్చిలో 'మా' కొత్త కార్యవర్గం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. మా ఇంట్లో కూడా బాగా తిట్టారు. 'మా' కోసం ఎందుకు అంతలా పనిచేస్తున్నావ్‌ అన్నారు. అందరం కలిసే నడవాలని చిరంజీవిగారు చాలా బాగా మాట్లాడారు. కానీ, ఇక్కడ నిప్పును కప్పిపుచ్చితే పొగ వస్తుంది. 'మా'లో గొడవలున్నాయి. రియల్‌ లైఫ్‌లో హీరోగా పనిచేస్తుంటే తొక్కేస్తున్నారు' అని చెప్పారు.


దీంతో అసంతృప్తికి గురైన చిరంజీవి.. 'నేను చెప్పిన మాటకు ఎవరూ విలువ ఇవ్వలేదు. మా మాటలకు గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఇక్కడ ఎందుకు ఉండాలి. ఎందుకు సభను రసాభాస చేయడం. రాజశేఖర్‌ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎంతో సజావుగా సాగుతున్న సభలో ఒక గౌరవం లేకుండా ఇలా మైక్‌ లాక్కుని ఎలా పడితే అలా మాట్లాడడం ఏం బాగోలేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే.. మీరిచ్చే పెద్దరికానికి అర్థం ఉండదు. దయచేసి దీనిని వదిలేయండి. ఎవరూ కోపావేశాలకు వెళ్లొద్దు. ఇలాంటప్పుడు ఇష్టం లేకపోతే రాకూడదు. ఇలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోండి' అని అన్నారు.

                                 

జీవిత క్షమాపణ:


ఈ విషయంపై జీవిత క్షమాపణలు తెలిపారు. అందరం కలిసి 'మా'ని మరింత గొప్పస్థాయికి తీసుకువెళ్లాలని ఆమె ఆకాంక్షించారు. ''మా' కార్యవర్గంలో సభ్యురాలినైనప్పటి నుంచి నేటి వరకూ నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఎందరో గొప్ప నటీనటుల వల్లే నేను ఎన్నో నేర్చుకున్నారు. అందరిలాగానే మాలో కూడా కొన్ని విబేధాలున్నాయి. గొడవలు రావడం సహజం. రాజశేఖర్‌, నేను 'మా'ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలనుకున్నాం. ఆయన చిన్నపిల్లాడు లాంటివాడు. ఇలాంటి కార్యక్రమంలో ఆయన అలా మాట్లాడినందుకు క్షమించమని నేను కోరుతున్నాను. విబేధాలున్నా సరే డైరీ విడుదల కార్యక్రమాన్ని అందరూ కలిసి చేయాలని మెగాస్టార్‌ చెప్పారు. నరేష్‌, రాజశేఖర్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇక ముందు కూడా మేమందరం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం' అని జీవిత చెప్పారు.

మోహన్‌బాబు, చిరు ఆత్మీయ ఆలింగనం:

మోహన్‌బాబు మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్లందరం ఒకే తల్లి బిడ్డలం. చిరంజీవికి, నాకు విబేధాలు లేవు. మా మధ్య నడిచేవి ఛలోక్తులు మాత్రమే అని తెలిపారు. దీంతో అక్కడే ఉన్న చిరంజీవి ఆయనను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ముద్దుపెట్టుకున్నారు. అంతేకాకుండా తనకి కృష్ణంరాజు తాతయ్య అవుతారంటూ మోహన్‌బాబు ఛలోక్తులు విసిరారు. దీంతో అక్కడ ఉన్న వారు నవ్వుల్లో మునిగిపోయారు.


'సినిమా పరిశ్రమలోని కళాకారులను గౌరవించాలన్నా, వారికి సాయం చేయాలన్నా టి.సుబ్బిరామిరెడ్డి గారు ముందుంటారు. అలాంటి గొప్పవ్యక్తి ముందు నేడు ఇలాంటి గొడవలు జరగడం చాలా బాధాకరంగా ఉంది. కృష్ణంరాజు తాతకు నమస్కారం. నేను తిరుపతిలో బిఏ చదువుతున్నప్పుడు మీ సినిమాలు చూశా. బావ మురళీమోహన్‌కు నమస్కారం. చిరంజీవికి నాకు విబేధాలు లేవు. మేమిద్దరం ఒకేచోట కలిస్తే ఛలోక్తులు విసురుకుంటామంతే. నా కుటుంబమే ఆయన కుటుంబం. ఆయన కుటుంబమే నా కుటుంబం. భగవంతుడి సాక్షిగా మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు సహజం కానీ మేమిద్దరం మాత్రం ఎప్పటికీ ఒక్కటే. ఏది ఏమైనా చిరంజీవి, కృష్ణంరాజుగారు చాలా గొప్పగా మాట్లాడారు. 'మా'లో గొడవలు జరుగుతున్న మాట వాస్తవం. జరిగింది చూస్తుంటే అర్థమవుతోంది. నీతులు చెప్పాలని మేం రాలేదు. నటీనటులందరం ఒకే తల్లి బిడ్డలం. మళ్లీ ఎన్నికలు వస్తాయి. ఏది శాశ్వతం కాదు. నిజం చెప్పాలంటే మనమే శాశ్వతం కాదు. నరేష్‌ నాకు తమ్ముడిలాంటి వాడు. 'మా' అభివృద్ధి పనులు గురించి చర్చించే సమయంలో చిరంజీవి నన్ను కూడా పిలుస్తానని చెప్పారు. కానీ నేను ఒక్కటే చెబుతున్నా ఆరోజు మాత్రం నన్ను పిలవకండి. నేను ఎవరితోనూ ఫైట్‌ చేయాలనుకోవడం లేదు. ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తా. నాకు రాజశేఖర్‌ అంటే ఇష్టమే. ఐ లవ్‌ రాజశేఖర్‌. ఐ లవ్‌ దట్‌ ఫ్యామిలీ. 'మా' ఎవడి సొత్తు కాదు. ఇది అందరిది. సవాళ్లు చేసుకోవడం మానేసి కలిసి మెలిసి పనిచేద్దాం.' అని మోహన్‌బాబు అన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.