ఆ మాటే నిజమైంది: మహేష్‌

‘అభిమానులంతా గర్వంగా కాలర్‌ ఎత్తుకునే సినిమా తీశామని ఇది వరకే చెప్పాను. ఆ మాట నిజమైంది. ఇప్పుడు నేను కూడా కాలర్‌ ఎత్తుకుంటున్నా’’ అన్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. అశ్వనీదత్, దిల్‌రాజు, పీవీపీ నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్‌లో విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ ‘‘నాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చూడ్డానికి వెళ్లాను. చివరి బంతికి ధోని సిక్స్‌ కొట్టినప్పుడు ఎంత సంతోషించానో ఈ సినిమా చూసి దిల్‌రాజు ‘సిక్సర్‌ కొట్టాం’ అన్నప్పుడు అంతగా ఆనందించాను. నా 25 సినిమాల ప్రయాణం చాలా ప్రత్యేకం. ‘మహర్షి’ మరింత ప్రత్యేకం. అమ్మ దగ్గరకు వెళ్లినప్పుడల్లా కాఫీ తాగుతుంటాను. అలా తాగితే దేవుడి గుళ్లో ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది. ‘మహర్షి’ విజయాన్ని అమ్మలందరికీ అంకితం చేస్తున్నా. కథలో భాగంగా మంచి పాటల్ని అందించారు దేవిశ్రీ. ఇలాంటి పాటలు ఆయన మాత్రమే అందించగలరు. నరేష్‌ ఈ పాత్ర చేస్తారా, లేదా? అనిపించింది. కథ వినగానే ఆయన ఒప్పుకున్నారు. తొలి వారంలోనే నా గత చిత్రాల రికార్డుల్ని ‘మహర్షి’ దాటుకుని వెళ్లబోతోంది.


అంతకంటే ఆనందం ఇంకేం లేద’’న్నారు. అల్లరి నరేష్‌ మాట్లాడుతూ ‘‘అసలు ఈ పాత్రలో నన్ను ఎలా ఊహించారా? అనిపిస్తోంది. వరుసగా కామెడీ పాత్రలు చేసుకుంటూ వెళ్తున్న నాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చిన సినిమా ఇది. మహేష్‌బాబుతో పనిచేయడం చాలా మంచి అనుభవం. పర్‌ఫెక్షన్‌కి ఆయన ఓ నిదర్శనం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చెప్పడానికి ‘మహర్షి’ ఓ ఉదాహరణ. మంచి మనసుతో ఈ సినిమా చూశారు. రైతులపై జాలి చూపించొద్దు, వాళ్లని గౌరవించమని చెప్పాం. రైతుల సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా చూపించాం’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ప్రతి సాంకేతిక నిపుణుడికీ తగిన గౌరవం ఇస్తుంటారు మహేష్‌. అందుకే ఆయనతో ఒక్కసారైనా పనిచేయాలనిపిస్తుంది. ఒక్కసారి పనిచేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంటుంద’’న్నారు దేవిశ్రీ ప్రసాద్‌. ‘‘రైతు నేపథ్యంలో కృష్ణగారు నటించిన చిత్రాలన్నీ బాగా ఆడాయి. మహేష్‌ తన 25వ సినిమాగా అలాంటి కథని ఎంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చరిత్రని తిరగరాస్తోంద’’న్నారు అశ్వనీదత్‌. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఈ కథని ముందు నుంచీ నేను, మహేష్, వంశీ నమ్ముతూనే ఉన్నాం. ఆ నమ్మకమే ఇప్పుడు నిజమైంది. చరిత్రలో నిలిచిపోయే చిత్రమిది. రైతుల గురించి మహేష్‌ ఓ సినిమా చేయడం, దానికి ఈ స్థాయిలో ఆదరణ దక్కడం గర్వంగా అనిపిస్తోంద’’న్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్‌ కనకాల, ఫృథ్వీ, పోసాని కృష్ణమురళి, శ్రీమణి, కమల్‌ కామరాజు, హరి తదితరులు పాల్గొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.