నటుడిగా సంతృప్తినిచ్చిన చిత్రం

‘‘నటులకి మంచి ఫలితం ఎంత ముఖ్యమో నాకు తెలుసు. సినిమా చూసి నమ్మకంగా ఉన్నాం కానీ ప్రేక్షకుల నుంచి ఇంత భారీ స్పందన వస్తుందని ఊహించలేదు. సినిమా చూసి నాగ్‌ మామ ఇంటికొచ్చి అభినందించారు. ‘ఏమాయ చేసావె’ తర్వాత మాకు చాలా ప్రత్యేకమైన సినిమా ఇది’’ అన్నారు సమంత. ఆమె తన భర్త నాగచైతన్యతో కలిసి నటించిన చిత్రం ‘మజిలీ’. దివ్యాంశ కౌశిక్‌ మరో కథానాయిక. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మాతలు. ఇటీవలే విడుదలైందీ చిత్రం. విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. సమంత మాట్లాడుతూ ‘‘సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందంటే నమ్మలేకపోతున్నా. ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ‘‘దర్శకుడు శివ కథ చెప్పినప్పుడు ఎలాంటి అనుభూతికి గురయ్యానో, ప్రేక్షకుల నుంచీ అదే స్పందన లభిస్తోంది. చాలా రోజుల తర్వాత నటుడిగా సంతృప్తినిచ్చిన చిత్రమిది. శివతో సినిమాలు చేస్తే గొప్ప నటుడిగా చూపిస్తాడనే నమ్మకం కలిగింది. రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి చక్కటి వినోదాన్ని పంచారు. ఈ నిర్మాతలతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. నాకు ‘మజిలీ’ ఒక భావోద్వేగ ప్రయాణం’’ అన్నారు. ‘‘ఈ సినిమా పేరు ప్రకటించినప్పట్నుంచి ట్రైలర్‌ విడుదల వరకు ప్రతిసారీ స్పందన లభించింది. అప్పుడే ఈ సినిమా విజయం మొదలైంది. మంచి సినిమాని వాణిజ్య కోణంలో తీయడం ఒక పెద్ద సవాల్‌గా అనిపించింది. పంపిణీదారులంతా ఫోన్‌ చేసి సినిమా ఘన విజయం అంటున్నారు. తదుపరి సినిమానీ ఇదే సంస్థలో చేయబోతున్నా’’ అన్నారు దర్శకుడు. ‘‘మధ్య తరగతి జీవితాల్లో ఉండే బాధల్ని శివ వాణిజ్య కోణంలో అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చాడు. ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందీ చిత్రం. మా ఆవిడ పతాక సన్నివేశాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంది’’ అన్నారు నటుడు రావు రమేష్‌. ‘‘ఈ సినిమా చూశాక చైతు ఇంత గొప్పగా నటిస్తాడా అని ఈర్ష్య కలిగింది. శోభన్‌బాబు... చైతూ రూపంలో వచ్చాడా అనిపించింది. చైతూ మంచివాడు. అతనిలో గొప్ప నటుడు ఉన్నాడని తెలుసుకొన్నా. కుటుంబ కథల్ని ఇలా కూడా తీయొచ్చని శివ నిరూపించాడు’’ అన్నారు పోసాని కృష్ణమురళి. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, కథానాయిక దివ్యాంశ కౌశిక్‌తో పాటు చిత్రబృందం పాల్గొంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.