‘మామాంగం’.. భారతీయులు తెలుసుకోవల్సిన కథ

కేరళలోని వలువనాడు ప్రాంతంలో 16 - 18 శతాబ్దాల మధ్య జీవించిన చావెరుక్కల్‌ యుద్ధవీరులకు గొప్ప చరిత్ర ఉంది. వీళ్లంతా ప్రాచీనమైన కలరీ యుద్ధ విద్యలో ఆరితేరిన వారు. ఇప్పుడు వీళ్ల జీవిత గాథతో మమ్ముట్టి ప్రధాన పాత్రధారిగా రూపొందించిన భారీ చరిత్రాత్మక చిత్రమే ‘మామాంగం’. ఎం.పద్మకుమార్‌ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌ నిర్మించారు. ప్రాచీ తెహ్లాన్, ఉన్ని ముకుందన్, అచ్యుతన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పాన్‌ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబరు 12న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్, మేకింగ్‌ వీడియోలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మమ్ముట్టి మాట్లాడుతూ.. ‘‘మాటల్లో చెప్పలేనంత గొప్ప అనుభవాన్ని ఈ చిత్రం నాకు అందించింది. ఇది సవాల్‌తో కూడుకొని ఉన్నదే అయినప్పటికీ ఓ మ్యాజిక్‌లా జరిగిపోయింది. మామాంగం అన్నది కేవలం కేరళకు సంబంధించిన మహోత్సవం మాత్రమే కాదు.. మన దేశం మొత్తానికి మహోత్సవం వంటిది. ప్రతి భారతీయుడు దీని గురించి తెలుగుసుకోవాలి. ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉన్న కథ ఇది. ఈ సినిమా కోసం 16, 18 శతాబ్దాల నాటి చరిత్రను ఎంతో వాస్తవికంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. సెట్స్‌ అన్నీ ఎంతో సహజ సిద్ధంగా, వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. గ్రాఫిక్స్‌ని చాలా తక్కువ వాడాం’’ అన్నారు. ‘‘చరిత్రలో కనిపించని హీరోలు ఎంతో మంది ఉన్నారు. ఇటీవల వచ్చిన ‘సైరా’ అలాంటి వీరుడి కథే. ఇప్పుడు రాబోతున్న ‘మామాంగం’ కూడా అలాంటి పోరాట యోధుల చరిత్రే. ఇది కేరళలోని ఒక ప్రాంతానికి సంబంధించిన కథ అయినప్పటికీ వాళ్ల పోరూ ఓ స్వాతంత్య్ర పోరాటం లాంటిదే. దాదాపు రూ.50కోట్ల ఖర్చుతో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి నిర్మాతలు ఇంత భారీ చారిత్రక చిత్రాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం. తెలుగులో నన్ను విడుదల చేయమని కోరగానే సంతోషంగా ఒప్పుకున్నా. మమ్ముట్టికి నాకు మంచి అనుబంధం ఉంది. తొలిసారి ‘స్వాతికిరణం’ కోసం ఆయన్ని తీసుకున్నట్లు తెలిసినప్పుడు.. ఓ మలయాళ నటుడు తెలుగు ప్రేక్షకులకు ఎంత మేర కనెక్ట్‌ అవుతారో అనుకున్నా. కానీ, థియేటర్లో సినిమా చూశాక లేచి నిలబడలేకపోయా. అంత అద్భుతంగా నటించారు. ఓ సందర్భంలో పవన్‌ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషించమని ఆయన్ని ఫోన్‌ చేసి అడిగా. దానికి ఆయన ‘ఇదే మాట చిరంజీవిని మీరు అడగగలరా’ అన్నారు. దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంత అద్భుతంగా తెరకెక్కించారో ట్రైలర్‌ చూస్తేనే అర్థమైపోతుంది’’ అన్నారు అల్లు అరవింద్‌. ‘‘ఇది నా తొలి చిత్రం. నాకిది సినిమా కాదు.. అద్భుతమైన ప్రయాణం. మమ్ముట్టి వంటి గొప్ప నటుడితో తెర పంచుకోవడం నాకు దక్కిన అదృష్టం. ఈ చిత్రం కేరళ చరిత్ర కాదు.. దేశ చరిత్ర’’ అంది ప్రాచీ తెహ్లాన్‌. ఈ కార్యక్రమంలో మహి.వి.రాఘవన్, శేఖర్, వివేక్‌ తదితరులు పాల్గొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.