ఈ షోకి నైట్‌ డ్రెస్‌లో రమ్మంటే ఆశ్చర్యపోయారు..

మంచు మోహన్‌బాబు నట వారసురాలిగా తెరకు పరిచయమైనా తనదైన ప్రతిభతోనే చిత్రసీమలో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది మంచు లక్ష్మీ ప్రసన్న. వెండితెరపైనే కాక ‘లక్ష్మీ టాక్‌ షో’, ‘ప్రేమతో మీ లక్ష్మీ’, ‘నేను సైతం’ వంటి కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులను మురిపించింది. ఇప్పుడు ‘ఫీట్‌ అప్‌ విత్‌ ద స్టార్‌’ అనే మరో సరికొత్త కార్యక్రమంతో డిజిటల్‌ మీడియాలో సందడి చేసేందుకు సిద్ధమైంది మంచు లక్ష్మీ. వూట్‌ ఆప్‌ ద్వారా ప్రసారం కాబోయే ఈ కార్యక్రమం సెప్టెంబరు 23 నుంచి ప్రసారం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమ విశేషాలను గురువారం హైదరాబాద్‌లో మీడియాతో పంచుకుంది లక్ష్మీ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ" ఇప్పటి వరకు నేను చేసిన షోస్ లో ఈ 'ఫీట్ అప్ విత్ ద స్టార్స్' కార్యక్రమం చాలా భిన్నమైనది. ఈ షో కోసం స్టార్స్ ని కలిసి నప్పుడు నైట్ డ్రెస్ లో రమ్మంటే వారి లో కొందరు ఆశ్చర్య పోయారు. కొందరు ఉత్సాహంగా ముందుకొచ్చారు. బాలీవుడ్ లో ఈ తరహా కార్యక్రమాలు సాధారణ మే. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం చాలా కొత్తగా ఉండబోతోంది. ఈ షోతో తెలుగు సినీతారల‍ వ్యక్తిగత వివరాలను ప్రజలతో పంచుకోనున్నాం. ఇందులో ఎక్కడా అభ్యంతరకర, వివాదాస్పద ప్రశ్నలకు తావులేదు. స్టార్స్ నా మీద పెట్టుకున్న భరోసా ను చెదరనివ్వలేదు. ఈ షో కి వచ్చే స్టార్స్‌తో చాలా మంది చాలా ఇంటర్వ్యూలు చేశారు. టాక్ షోలు, వివిధ వేదికల్లో వారు మాట్లాడి ఉంటారు. దీంతో వాళ్ల విషయాలు చాలా తెలుసు అనుకుంటాం. కానీ వారి లో ప్రతి రోజు ఎదో మార్పు వస్తుంది. వారి మాటలు, అనుభవాల్లో అవి కనిపిస్తుంటాయి. ఉదాహరణకు సమంతా మనకు చాలా తెలుసు అనుకుంటాం. కానీ, నాగ చైతన్య గురించి ఈ షో లో మాట్లాడిన విషయాలు ప్రతిఒక్కరినీ సర్ప్రైజ్ చేసేలా ఉంటాయి. వరుణ్ తేజ్ ఈ షోతో మీకు మరింత కొత్తగా పరిచయం కాబోతున్నారు. చాలా బాగా వచ్చింది ఆ ఎపిసోడ్. వచ్చిన వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని బాగా ఆస్వాదించారు. నా గత కార్యక్రమాల్లాగే ఈ షో కూడా మంచి ఆదరణ దక్కించుకుంటుందని నమ్ముతున్నా. ఈ నెల23 నుండి ‘వూట్ ఆప్’లో అందుబాటులో ఉంటాయి. ప్రతి సోమవారం కొత్త ఎపిసోడ్ అందుబాటులోకి వస్తుంది" అన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.