‘స్వేచ్ఛ’ ఇచ్చేందుకు వస్తుంది

పర్యావరణ పరిరక్షణకి చెట్లు ఎంత ముఖ్యమో... ఈ సృష్టికి ఆడపిల్ల అంతే ముఖ్యమని చెప్పే ప్రయత్నమే మా చిత్రం అంటున్నారు చౌహాన్‌. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘స్వేచ్ఛ’. ప్రముఖ గాయని మంగ్లీ ప్రధాన పాత్రని పోషించారు. ఆంగోత్‌ రాజునాయక్‌ నిర్మించారు. ఈ నెల 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఆడపిల్ల పుడితే చాలు... అమ్మో అనుకుంటూ అమ్మేస్తున్న సమాజంలో ఉన్నాం. అలా అమ్మకానికి గురై, అభాగ్యురాలైన స్వేచ్ఛ అనే యువతి కథే ఈ చిత్రం. ఆమె ఎలా బతికింది? ఏం సాధించిందనేది ఆసక్తికరం. ఆడపిల్లలు ఏ రంగంలోనూ తీసిపోరని చాటిచెప్పే ప్రయత్నం చేశాం. మంగ్లీ నటన చిత్రానికి ప్రధాన బలం. చమ్మక్‌చంద్ర పాత్ర కూడా మెప్పిస్తుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘మంగ్లీ పాత్ర నవతరం అమ్మాయిలకి ప్రేరణగా నిలుస్తుంది. హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అందరినీ మెప్పిస్తుంది’’ అన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.