ఆ విషయంలో మా నాన్నే నాకు స్ఫూర్తి

‘‘కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే సినీ ప్రయాణం చేస్తున్నా. ఆ విషయంలో మా నాన్నే నాకు స్ఫూర్తి. ఆయన అప్పట్లోనే కొత్తతరం సినిమాలు చేశార’’న్నారు అక్కినేని నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటించి, పి.కిరణ్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి వస్తున్న ఆదరణపై ఆనందం వ్యక్తం చేస్తూ ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘‘యువతరం ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచించి సినిమాలు చేస్తుంటా. ఆ లక్షణం నాన్న నుంచే నాకు వచ్చింది. ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతోనే అప్పట్లో ‘గీతాంజలి’ చేశా. ప్రేక్షకులు దాన్ని స్వీకరించడానికి సమయం పట్టింది. ‘అన్నమయ్య’ చిత్రాన్ని తొమ్మిదో రోజు థియేటర్ల నుంచి తీసేయడానికి సిద్ధమయ్యారు. కానీ 11వ రోజు నుంచి థియేటర్లు నిండిపోయాయి. ‘మన్మథుడు’ విడుదల తర్వాత కూడా దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ ఆందోళన చెందుతుంటే.. ‘కొత్త కథతో తీసిన సినిమా కాబట్టి ప్రేక్షకులకి చేరువ కావడానికి కాస్త సమయం పడుతుంద’ని చెప్పా. ‘మన్మథుడు 2’ని నాలో కొత్తదనం చూసుకొనేందుకే చేశా. ఇలాంటి ప్రయోగాలు చేయడంతోనే ఇంతదూరం వచ్చా. ఈ చిత్రంతో కథానాయకుడిగానూ, నిర్మాతగానూ సంతృప్తిగా ఉన్నాన’’న్నారు. జాతీయ పురస్కారాలపై నాగార్జున స్పందిస్తూ ‘‘ఈ ఏడాది తెలుగు సినిమాలకు ఏడు పురస్కారాలొచ్చాయి. ‘చి.ల.సౌ’ నిర్మాణంలో నేను భాగస్వామిని కాబట్టి ఆ చిత్రానికీ పురస్కారం రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు. రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ ‘‘సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకి వెళితే అక్కడ ప్రేక్షకులు సినిమాని ఆస్వాదిస్తున్న విధానం చూసి ఆనందం కలిగింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్‌ భరద్వాజ్‌, పి.కిరణ్‌. కిట్టు విస్సాప్రగడ, ఛోటా కె.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.