ఆయన డబ్బు కోసం ఏనాడు సినిమా తీయలే!

‘‘ప్రపంచంలోని అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్యదేశం మనది. అలాంటి దేశంలో కేవలం పది శాతం మంది చేతిలో మాత్రమే అధికారం ఉంది. బడుగు బలహీన వర్గాల ప్రజలు అన్యాయమైపోతున్నార’’న్నారు ఆర్‌.నారాయణమూర్తి. ఆయన నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్, పరుచూరి గోపాలకృష్ణ, శేఖర్‌ కమ్ముల, బి.గోపాల్, కాశీ విశ్వనాథ్‌ తదితరులు ఈ చిత్రాన్ని వీక్షించారు. పూరి మాట్లాడుతూ ‘‘చిన్నప్పటి నుంచీ మూర్తిగారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇన్నేళ్లయినా ఆయన తన పంథాని మార్చుకోకపోవడం గొప్ప విషయం’’ అన్నారు. ‘‘డబ్బు కోసం ఏనాడూ సినిమా తీయని వ్యక్తి ఆర్‌.నారాయణమూర్తి. ప్రజా సమస్యలే ఆయన కథలయ్యాయ’’న్నారు వినాయక్‌. ‘‘ఇన్నేళ్లుగా సందేశాత్మక చిత్రాలు చేయడం గొప్ప విషయం’’ అన్నారు శేఖర్‌ కమ్ముల. ‘‘రాజ్యాధికారం కోసం అంబేద్కర్, జ్యోతిబాపులే వేసిన బాటలో దేశం పయనించాలి. ప్రజాస్వామ్యం అంటే అంగట్లో సరుకు కాదు. ఓటుని ఎవ్వరూ అమ్ముకోకూడదు’’ అన్నారు నారాయణమూర్తి. ఈ కార్యక్రమంలో గద్దర్, ధవళ సత్యం, ఎల్‌బీ శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.