లోపాల్ని ఎత్తి చూపే సినిమా ఇది

‘‘సామాన్యుడికి విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుందని చెప్పే ప్రయత్నమే మా చిత్రమ’’న్నారు భరత్‌. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘ఎమ్‌.బి.ఎమ్‌’ (మేరా భారత్‌ మహాన్‌). అఖిల్‌ కార్తీక్‌, ప్రియాంక శర్మ జంటగా నటించారు. చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ముగ్గురు వైద్యులు ఒక సదుద్దేశంతో ఈ సినిమా చేయడానికి నా దగ్గరికి వచ్చారు. శ్రీధర్‌రాజు కథ చెప్పినప్పుడు నాకెందుకు ఇన్నాళ్లూ ఇలాంటి ఆలోచన రాలేదనిపించింది. మన వ్యవస్థలో లోపాల్ని ఎత్తి చూపుతూ, వాటికి పరిష్కారం సూచించే ప్రయత్నం ఈ చిత్రంతో చేశాం’’ అన్నారు. కథా రచయిత, నిర్మాతల్లో ఒకరైన డా.శ్రీధర్‌రాజు ఎర్ర మాట్లాడుతూ ‘‘ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు, వాటిలో లోటుపాట్లు ఇందులో చూపిస్తున్నాం’’ అన్నారు. ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌ మాట్లాడుతూ ‘‘శ్రీధర్‌ పలు వైద్యశాలల్ని నిర్వహిస్తూ, ఎంతోమందికి సాయం అందిస్తున్నారు. ఆయన ఒక మంచి సందేశంతో నిర్మించిన ఈ చిత్రం అందరికీ చేరువ కావాల’’న్నారు. ఇటీవల వరంగల్‌ జిల్లాలో అప్పుల బాధతో మరణించిన రెండు రైతు కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించింది చిత్రబృందం. ప్రభుత్వాలు వెంటనే ఆ కుటుంబాల్ని ఆదుకోవాలని డా.శ్రీధర్‌రాజు కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్ల రవి, విష్ణువర్ధన్‌ రాజు, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.