ఆట, ప్రేమ’ కలిసి ‘మిస్‌మ్యాచ్‌’ అయ్యాయి

ఆటంటే గెలుపు, ఓటమే కాదు... అంతకుమించి! ఆటలో పోరాటం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. వీటితోపాటు ఎత్తులు పైఎత్తులూ ఉంటాయి. అవన్నీ కలిసి ప్రేక్షకులకు బోలెడన్ని అనుభూతులతో పాటు... వినోదాన్ని పంచుతాయి. అలాంటి వినోదంతోనే ‘మిస్‌ మ్యాచ్‌’ రూపొందుతోంది. ‘ఆటగదరా శివ’తో ఆకట్టుకున్న ఉదయ్‌ శంకర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఐశ్వర్య రాజేష్‌ కథానాయిక. ఎన్‌.వి.నిర్మల్‌ కుమార్‌ దర్శకుడు. ఈయన తెలుగులో విజయవంతమైన ‘డా.సలీం’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు. తొలిసారి తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అధిరోహ్‌ క్రియేటివ్‌ సైన్స్‌ ఎల్‌.ఎల్‌.పి పతాకంపై జి.శ్రీరామ్‌రాజు, భరత్‌ రామ్‌ నిర్మిస్తున్నారు. శుక్రవారం ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు క్రిష్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడు నిర్మల్‌ నాకు మంచి మిత్రుడు. ఆయన సినిమా తీసే విధానం ఎలాంటిదో ‘డా.సలీం’తోనే అర్థమైంది. భూపతిరాజా విజయవంతమైన చిత్రాల రచయిత. ఉదయ్‌ శంకర్‌, ఐశ్వర్య రాజేష్‌, నిర్మాతలు, ఛాయాగ్రాహకుడు గణేష్‌... ఇలా అందరూ నాకు తెలిసినవాళ్లే. విలువలతో కూడిన చిత్రం ‘ఆటగదరా శివ’తో పరిచయమయ్యాడు ఉదయ్‌ శంకర్‌. ‘మిస్‌ మ్యాచ్‌’ అందరికీ ఓ మంచి విజయాన్ని అందించే చిత్రమవుతుంది’’ అన్నారు. కథానాయకుడు ఉదయ్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కథ వినగానే చేసేయాలనుకొన్నా. కథకు తగ్గట్టుగానే సినిమా బాగా రూపుదిద్దుకొంటోంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘క్రిష్‌ నాకు మంచి మిత్రుడు. ఆయన ప్రచార చిత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. తెలుగులో ఇది నా తొలి సినిమా. భూపతిరాజా మంచి కథని అందించారు. నేను తీసిన ‘డా.సలీమ్‌’ని ఎలా అయితే ఆదరించారో, ఈ చిత్రాన్నీ అదే స్థాయిలో విజయవంతం చేస్తారని నమ్ముతున్నా’’ అన్నారు. మాటల రచయిత రాజేంద్రకుమార్‌ మాట్లాడుతూ ‘‘ఇదొక అచ్చమైన, స్వచ్ఛమైన ప్రేమకథ. ‘బొమ్మరిల్లు’, ‘కొత్తబంగారులోకం’, ‘కంచె’ చిత్రాల స్థాయిలో రూపొందుతోంద’’న్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఇలాంటి చిత్రంతో నిర్మాతలుగా పరిచయమవుతున్నందకు ఆనందంగా ఉంది. మా అందరి గురువు శ్రీరామ్‌ సర్‌ వల్లే మేం ఇక్కడ ఉన్నాం. ఆయన కుమారుడు ఉదయ్‌ శంకర్‌ ఇందులో కథా నాయకుడు. తనకి ఈ చిత్రంతో మంచి విజయం లభిస్తుంద’’న్నారు. కార్యక్రమంలో చిత్ర ఛాయాగ్రాహకుడు గణేష్‌ చంద్ర, సంగీత దర్శకుడు గిఫ్టన్‌ ఇలియాస్‌, మాటల రచయిత మధు, రచయిత భూపతిరాజా తదితరులు పాల్గొన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.