ప్రేమ సంఘర్షణల ‘మిస్‌ మ్యాచ్‌’ఉదయ్‌శంకర్‌, ఐశ్వర్యా రాజేష్‌ జంటగా నటించిన చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. ఎన్వీ నిర్మల్‌కుమార్‌ దర్శకుడు. జి.శ్రీరామరాజు, భరత్‌రామ్‌ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘భూపతిరాజా చక్కటి కథని అందించారు. ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య నెలకొన్న ప్రేమ సంఘర్షణని ఆట నేపథ్యంలో తెరపైన చూపించాం. ప్రేమ, రొమాన్స్‌, భావోద్వేగాలతో పాటు డ్రామా, కామెడీ, యాక్షన్‌ అంశాలు ఆకట్టుకుంటాయి. ఒక సవాల్‌గా తీసుకుని ఐశ్వర్యా రాజేష్‌ నటించింది. ఉదయ్‌శంకర్‌ తన పాత్రలో జీవించాడు. గణేష్‌చంద్ర ఛాయాగ్రహణం, గిఫ్టన్‌ సంగీతం చిత్రానికి ప్రధానాకర్షణ’’ అన్నారు. ఐశ్వర్యా రాజేష్‌ మాట్లాడుతూ ‘‘ముందు నుంచీ విభిన్నమైన కథల్ని ఎంచుకుంటున్నా. తమిళ చిత్రం ‘కాక్క ముట్టై’లో ఇద్దరు పిల్లలకి తల్లిగా నటించా. ఆ సినిమాకి అంతర్జాతీయంగా పేరొచ్చింది. ఇందులోనూ ఓ భిన్నమైన పాత్రని పోషించా. అమాయకత్వంతో పాటు ధైర్యాన్ని ప్రదర్శించే రెజ్లర్‌ పాత్ర నాది. రెజ్లింగ్‌ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని నటించా’’ అన్నారు. ఉదయ్‌శంకర్‌ మాట్లాడుతూ ‘‘ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్న సమయంలో భూపతిరాజా ఈ కథ వినిపించారు. నిర్మల్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తీసిన విధానం చూశాక ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు. నా అభిమాన కథానాయకుడు పవన్‌కల్యాణ్‌. ఆయన ‘తొలిప్రేమ’ సినిమాలోని ‘ఈ మనసే...’ పాటని మా సినిమాలో రీమిక్స్‌ చేశాం. అందులో ఆడిపాడటం మంచి అనుభూతినిచ్చింది. ఆ పాట కోసం రామోజీ ఫిలింసిటీలో నాలుగు రోజులు రిహార్సల్స్‌ చేసి నటించాం. 40 మంది డ్యాన్సర్లపై సింగిల్‌ షాట్‌లో పూర్తి చేశాం. ఐశ్వర్యరాజేష్‌తో నటించడం సవాల్‌గా అనిపించింది’’ అన్నారు. ఇందులోని ఐదు పాటలూ ఆహ్లాదాన్ని పంచుతాయన్నారు సంగీతదర్శకుడు గిఫ్టన్‌. నిర్మాత శ్రీరామరాజు మాట్లాడుతూ ‘‘నాయకా నాయికలు బాగా నటించారు. ‘ఆటగదరా శివ’లో ఉదయ్‌శంకర్‌ నటన నచ్చి ఇందులోని పాత్రకోసం ఎంపిక చేశామ’’న్నారు. మరో నిర్మాత భరత్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘కొన్ని సన్నివేశాల్లో ఉదయ్‌శంకర్‌, ఐశ్వర్య రాజేష్‌ నటన చూశాక కన్నీళ్లొచ్చాయి’’ అన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.