అందరూ సహకరించాలి

‘‘కరోనా వైరస్‌ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చిత్రీకరణలను సోమవారం నుంచి నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని ప్రకటించారు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు నారాయణదాస్‌ నారంగ్‌. కరోనాపై ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈనెల 21 వరకు సినిమా థియేటర్లను మూసేయాలని నిర్ణయించింది. దానికి మద్దతుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరికొన్ని కీలక చర్యలకు నడుం బిగించింది. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా), నిర్మాతల మండలి సభ్యులు ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం విలేకర్ల సమావేశంలో చలనచిత్ర వాణిజ్యమండలి కార్యదర్శి దామోదర్‌ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ‘తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’, ‘మా’ రెండు తెలుగు రాష్ట్రాల్లోని చిత్రీకరణలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇది కొందరు నిర్మాతలకు ఇబ్బందికరమైనా కార్మికుల క్షేమాన్ని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ సహకరించాలని కోరుతున్నాం. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని లాభనష్టాల కోణంలో బేరీజు వేయడానికి వీü™్లదు. ప్రజారోగ్యమే ముఖ్యం’’ అన్నారు. ‘మా’ తాత్కాలిక అధ్యక్షుడు బెనర్జీ మాట్లాడుతూ ‘‘తెలంగాణ ప్రభుత్వం థియేటర్ల మూసివేతను పొడిగిస్తే దాని ప్రకారం మేమూ దీన్ని కొనసాగించాలా? లేదా? అన్నది నిర్ణయించుకుంటాం’’ అన్నారు. నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణలో ఇప్పటికే చిత్రీకరణలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. అభ్యంతరం లేని ఆంధ్ర ప్రాంతాల్లో చిత్రీకరణలు జరుగుతున్నాయి. బయట ప్రాంతాల్లో చిత్రీకరణలు జరుపుకుంటున్న వాళ్లని మేం ఆపమని చెప్పం. ఆ ప్రాంతాల్లో వాళ్లకెలాంటి ఇబ్బందులు లేకపోతే చిత్రీకరణ కొనసాగించుకోవచ్చు. కాకపోతే మా తరఫున వాళ్లకు సూచనలు చేస్తాం’’ అన్నారు. ‘మా’ ప్రధాన కార్యదర్శి జీవిత, నిర్మాతలమండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌తో పాటు నట్టికుమార్, ఠాగూర్‌ మధు తదితరులు పాల్గొన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.