
పాటల రచయిత శ్రీమణి ఓ ఇంటివాడయ్యారు. ఫరాని వివాహమాడి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నవంబరు 22న కొద్దిమంది అతిథుల సమక్షంలో వైభవంగా ఈ వేడుక జరిగింది. పదేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు కుటుంబ సభ్యుల అనుమతితో ఒక్కటయ్యారు. ఈ ఆనందాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు శ్రీమణి. ‘ఈ మధుర క్షణం కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఆ (కల నెరవేరింది)సమయం వచ్చింది. మా మనసుల్ని అర్థం చేసుకున్న భగవంతుడికి, తల్లిదండ్రులకు ధన్యవాదాలు. వివాహ జీవితం ఆరంభం’ అంటూ పెళ్లి ఫొటోలు పంచుకున్నారు. చూడ ముచ్చటైన ఈ జంటను చూసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘100%లవ్’ చిత్రంతో గేయ రచయితగా పరిచయమయ్యారు శ్రీమణి. అన్ని రకాల పాటలు రాస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రతిచోట వినిపిస్తున్న ‘నీ కన్ను నీలి సముద్రం’ ఈయన కలం నుంచి జాలువారిందే.
