గ్రామీ గాయనులదే సత్తా
సంగీత ప్రపంచంలో ప్రతిభకు పట్టం కట్టే ప్రతిష్ఠాత్మక గ్రామీ పురస్కార వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్‌లో గాయనీగాయకుల తళుకుబెళుకులతో ఈ ఉత్సవం సందడిగా సాగింది. 2017-18కిగానూ వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన సంగీతకారులకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈసారి గ్రామీ వేదికపై మహిళలు చరిత్ర సృష్టించారు. మొదట్నుంచీ గ్రామీ పురస్కారాల విషయంలో పురుషాధిక్యత కనిపించేది. వ్యాఖ్యాతలు మొదలుకొని వేదికపై ప్రదర్శనలు చేసేవారు, పురస్కార విజేతల వరకూ పురుషులే ఎక్కువగా ఉండేవారు. దీనిపై గతేడాది విమర్శలు కూడా వచ్చాయి. దానికి భిన్నంగా ఈ ఏడాది మహిళలు అత్యధిక పురస్కారాలు దక్కించుకుని సత్తా చాటడం విశేషం. అంతేకాదు.. వ్యాఖ్యాతగా గాయకురాలు అలీసియా కీస్‌ వ్యవహరించింది. గ్రామీ వేడుకను ఓ మహిళ వ్యాఖ్యాతగా నిర్వహించడం 14 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.


గాయకురాలు కసే ముస్‌గ్రేవ్స్‌ నాలుగు విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుని సత్తా చాటింది. ‘గోల్డెన్‌ అవర్‌’ ఆల్బమ్‌తో ప్రతిష్ఠాత్మకమైన ‘ఆల్బమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ విభాగంలో నామినేషన్‌ దక్కించుకున్న ముస్‌గ్రేవ్స్‌ విజేతగా నిలిచింది. దీంతో పాటు బెస్ట్‌ కంట్రీ ఆల్బమ్, బెస్ట్‌ కంట్రీ సాంగ్, బెస్ట్‌ కంట్రీ సోలో పర్‌ఫార్మెన్స్‌ విభాగాల్లోనూ పురస్కారాలు సొంతం చేసుకుంది. మరో గాయకురాలు కార్డి బి చరిత్ర సృష్టించింది. సోలో ప్రదర్శనతో బెస్ట్‌ ర్యాప్‌ ఆల్బమ్‌ విభాగంలో గ్రామీ పురస్కారం అందుకున్న తొలి మహిళగా నిలిచింది. ‘ఇన్‌వేసన్‌ ఆఫ్‌ ప్రైవసీ’ ఆల్బమ్‌తో ఆ ఘనత సాధించిందామె. ప్రముఖ గాయని, రచయిత్రి లేడీ గాగా రెండు పురస్కారాలు అందుకుంది. ‘ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌’ చిత్రంలోని ‘షాలో..’ పాటకు బ్రాడ్లీ కూపర్‌తో కలసి ‘బెస్ట్‌ పాప్‌ డ్యుయొ పర్‌ఫార్మెన్స్‌ అండ్‌ బెస్ట్‌ సాంగ్‌ రిటెన్‌ ఫర్‌ విజువల్‌ మీడియమ్‌’ విభాగంలో విజేతగా నిలిచింది. దీంతోపాటు బెస్ట్‌ పాప్‌ పర్‌ఫార్మెన్స్‌ పురస్కారమూ అందుకుంది. ఈ వేడుకలో మిషెల్‌ ఒబామా, జెన్నిఫర్‌ లోపెజ్‌ తదితరులు సందడి చేశారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.